Jagga Reddy: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రోజూ పాలిచ్చే ఆవునని.. కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు.
శనివారం 15వేల మంది సంగారెడ్డి ప్రజలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో ప్రస్తుతం మహిళలు ప్రయాణం చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే బస్సుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న వివాదాల గురించి కూడా ఆయన స్పందించారు. 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా? అంటూ ప్రతిపక్షాలను జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. అన్ని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ఇలా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ తో మాట్లాడి గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తాని హామీ ఇచ్చారు. ఒక్కో వార్డుకు 8 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తానని.. జగ్గారెడ్డి మాటంటే మాటే అని తేల్చి చెప్పారు. సంగారెడ్డిలో అన్ని వార్డులు గెలిస్తే 300 కోట్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు 2013లో 5500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చానని.. కానీ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క మంజూరు పత్రం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
Also Read: Pawan Kalyan: రోడ్డు లేక విద్యార్ధుల ఇక్కట్లు.. కదిలిన డిప్యూటీ సీఎం.. ఆగమేఘాలపై ఆదేశాలు
తాను ఎమ్మెల్యేగా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని జగ్గారెడ్డి అన్నారు. 5500 మందితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ‘నా భార్య నిర్మలా సంగారెడ్డిలో పర్యటిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆమె పోటి చేస్తుంది. నేను తెలంగాణ మొత్తం తిరుగుతా. మీకు రోజు పాలిచ్చే ఆవు కావాలా? ఐదేళ్లకోసారి పాలిచ్చే ఆవు కావాలా? మీరే తేల్చుకోండి. అప్పుడప్పుడు ఆవుకు మేత దొరక్కపోతే పాలివ్వదు. నేను కూడా అంతే. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో వేరే పార్టీ అభ్యర్థులను గెలిపించి నన్ను పనులు చేయమంటే ఎలా చేస్తా?’ అంటూ జగ్గారెడ్డి ప్రజలను ప్రశ్నించారు.