Tanveer Ahmed On PAK VS SL: పాకిస్తాన్ వేదికగా జరిగిన వన్డే ట్రై సిరీస్ లో షాహీన్ అఫ్రిది సేన విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టును చిత్తు చేసి మరీ విక్టరీ అందుకుంది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కొత్త ఊపు వచ్చింది. పాకిస్తాన్ విజయంపై మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యాడు. లహూర్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించిందని మెచ్చుకున్నాడు. ఇదే ఊపుతో 2027 వన్డే వరల్డ్ కప్ కూడా గెలవాలని దిశ నిర్దేశం చేశాడు.
వన్డే ట్రై సిరీస్ గెలిచిన పాకిస్తాన్… భవిష్యత్తులో జరిగే 2027 వరల్డ్ కప్ సందర్భంగా టీం ఇండియాను కూడా ఓడిస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియాను ఓడించి ఇదే కెప్టెన్ షాహీన్ అఫ్రిది 2027 వన్డే వరల్డ్ కప్ ప్రోఫీని ముద్దాడుతాడని సంచలన ప్రకటన చేశాడు. ప్రపంచంలోనే పాకిస్తాన్ జట్టు చాలా బలమైన వన్డే జట్టుగా కనిపిస్తోందని, కచ్చితంగా ఛాంపియన్ అవుతుందన్నాడు. ఒకవేళ పాకిస్తాన్ ట్రోఫీ గెలవకపోతే తాను లాహోర్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డే ట్రై సిరీస్ ఫైనల్ సందర్భంగా అరాఫత్ మిన్హాస్ అద్భుతంగా రాణించాడు. ఏడవ వికెట్ కు బరిలోకి దిగిన అరాఫత్ మిన్హాస్ 31 బంతుల్లో 61 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఇందులో నాలుగు సిక్సులతో పాటు మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. ఈ దెబ్బకు పాకిస్తాన్ అవలీలగా మ్యాచ్ గెలిచింది. ఈ క్రమంలోనే ఈ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా అతనికి దక్కింది. అయితే అరాఫత్ మిన్హాస్ ప్రదర్శన పై తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అతడు ప్రపంచంలోనే భయంకరమైన ఆల్ రౌండర్ గా అరాఫత్ మిన్హాస్ మారాడని మెచ్చుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడని తెలిపాడు. అతడు ఆడే ప్రతి షాట్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఇలాంటి అసాధారణ టాలెంట్ ఉన్న ఆల్రౌండర్లు దొరకడం చాలా కష్టమని.. పాకిస్తాన్ లో అరాఫత్ మిన్హాస్ ఉండడం అదృష్టమేనని తెలిపాడు. కేవలం 21 సంవత్సరాల వయసులోనే ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాడంటే.. అతన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాగా వాడుకోవాలని సూచనలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్ కు సరిపోయే అసలు సిసలైన క్రికెటర్ ఇతడేనని తెలిపాడు.