Karimnagar Development: రాజకీయాలు ఏవైనా సరే, ఎన్నికలు ముగిశాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత. సరిగ్గా ఇదే సూత్రాన్ని గుర్తుచేస్తూ కరీంనగర్ పట్టణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలిపాయి. నగరంలో రూ.4 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అర్బన్ డెవలప్‌మెంట్ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ సునీల్ రావు ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఎన్నికల వరకే రాజకీయం..
కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉత్తర తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం. ఆ తర్వాత ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధే మా ప్రథమ ప్రాధాన్యత. ఇప్పటికే ప్రభుత్వం కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేసింది. విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పోటీపడి పనిచేస్తున్నాం,’ అని పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల విచారణ కొనసాగుతూనే అభివృద్ధి వేగవంతం చేస్తామన్నారు.
డంపింగ్ యార్డ్‌పై చిల్లర రాజకీయాలు వద్దు: బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరం వెనుకబడిపోయిందని మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో యూసీఎఫ్ (UCF) నుంచి రూ.840 కోట్లు మంజూరు చేయించామని వెల్లడించారు. అలాగే సుదీర్ఘకాలంగా నగరవాసులను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి రూ.70 కోట్లు తీసుకొచ్చామని, అయితే కొందరు స్వార్థ నాయకులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి పారిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమికొట్టక తప్పదని హెచ్చరించారు.
నగరవాసులకు ఊరట.. ఏడాదిలో రోడ్లు పూర్తి!
మానేరు తీరంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను తక్షణమే జనావాసాలకు దూరంగా తరలించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇద్దరు నేతలూ స్పష్టం చేశారు. అందరి సమన్వయంతో రాబోయే ఏడాది కాలంలో కరీంనగర్ నగరంలోని అన్ని అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.
Also Read: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!