Karimnagar Man: బిడ్డల భవిష్యత్ కోసం హాస్టల్‌లో వేసి చదివిస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లి పోతుంటారు. సెలవులు ఎప్పుడొస్తాయా? తన బిడ్డల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తుంటారు. వచ్చాక ఆడిస్తారు.. లాలిస్తారు. పిల్లలు పెద్దవారైనా వాళ్లను మిస్ చేసుకున్న ప్రతిక్షణాన్ని గుర్తు చేసుకుంటు ముద్దాడుతారు. అలాంటిది.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు నాలుగేళ్ల వయసులో తప్పిపోతే.. ఏళ్ల తరబడి వెతికినా ఆచూకీ దొరక్కపోతే.. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. అమ్మానాన్నల లాలనలో పెరగాల్సిన ఆ చిన్నారి.. ముక్కుపచ్చలారని వయసులో దూరం అయితే.. ఊహిస్తేనే గుండె తరుక్కుపోతుంది కదా. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదోనికి చెందిన వీరేష్ జనార్ధన్.. నాలుగేళ్ల వయసులో తప్పిపోయి ట్రైన్ ఎక్కి తమిళనాడు వెళ్లిపోయాడు. బిక్కుబిక్కుమంటూ స్టేషన్ పరిసరాల్లో తిరిగాడు. అతన్ని చూసిన రైల్వే పోలీసులు బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. కొంత కాలం తర్వాత అక్కడి నుంచి ముంబైకి వెళ్లి అనాథాశ్రమంలో పెరిగాడు. ప్రస్తుతం ఓ హోటల్‌లో వెయిటర్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు.
వీరేష్ కోసం అతని తల్లిదండ్రులు వెతకని చోటంటూ లేదు. అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పోస్టర్లు అంటించి అణువణువు గాలించినా లాభం లేకపోయింది. అలా 28 ఏళ్లు గడిచిపోయాయి. ఏదో ఒకరోజు తమ కొడుకు తిరిగొస్తాడని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారు. కనపడ్డ గుళ్లు, రాళ్లు, చెట్లకు మొక్కారు. కానీ, దేవుడు వాళ్ల మొర ఆలకించడానికి 28 ఏళ్లు పట్టింది.
Also Read: లూలూ మాల్‌లో భారీ డిస్కౌంట్.. కళ్ళు చెదిరే ఆఫర్లు.. ఎన్ని రోజులో తెలుసా..
చిన్నతనంలో తల్లిదండ్రులు నేర్పిన ఊరు పేరు, కుటుంబ వివరాలన్నీ వీరేష్‌కు కాస్త గుర్తున్నాయి. కుటుంబాన్ని కలుసుకోవాలనే ఆశను ఏనాడూ వదులుకోలేదు. ఆ సమాచారంతో ఆదోని వచ్చి రెండు రోజులు ఊర్లో తిరిగినా తనవాళ్ల గురించి ఏ ఆధారం లభించలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురించి తెలుసుకుని.. ఆదోని సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించాడు. తన దీన గాథనంతా వివరించాడు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ భరద్వాజ్.. మున్సిపల్ కమిషనర్ సాయంతో వీరేష్ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నాడు. వీరేష్ తన కుటుంబాన్ని కలుసుకున్నా.. తన అమ్మానాన్నలు బ్రతికిలేరనే వార్త విని జీర్ణించుకోలేకపోయాడు. ప్రస్తుతం అతని మేనమామ దగ్గరికి తీసుకున్నాడు.