Kalvakuntla Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల నేతలతో కవిత సమావేశం అయ్యారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు పార్టీ నేతలు, క్యాడర్ ను సమాయత్తం చేశారు.
రాబోయే రోజుల్లో పార్టీ నేతలు, క్యాడర్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై కవిత దిశా నిర్దేశం చేశారు. నిజామాబాద్, కొడంగల్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలపై ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు
ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన తర్వాత తెలంగాణ రక్షణ సేన స్పందించిన తీరుతోనే ప్రభుత్వం దిగివచ్చిందని కవిత గుర్తు చేశారు. ఏళ్లకెళ్లుగా రిమ్స్ హాస్పిటల్ ను పట్టించుకోని ప్రభుత్వం తక్షణ చర్యల కోసం రూ.11 కోట్లు రిలీజ్ చేసిందన్నారు. కలెక్టర్ రిమ్స్ హాస్పిటల్ సమస్యలపై రివ్యూ చేసి చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి నివేదించారని పేర్కొన్నారు. తాను ఆస్పత్రిని విజిట్ చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన తర్వాతనే ప్రభుత్వం దిగివచ్చి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు
Also Read: ‘పోలీసు స్టేషన్‌లో ఎవరి ఫోటో పెట్టాలో తెలుసా?’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్!
రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు తక్షణం స్పందించి వారికి అండగా నిలవాలని కవిత సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లు, సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పోటీ చేసి సత్తా చాటాలని నేతలకు సూచించారు. కాగా, ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలు బుధవారం వరకు కొనసాగనున్నాయి. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, బుధవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో కవిత సమావేశం కానున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
Also Read: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!