Kavitha: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ సమాజం, ఉద్యమకారులు ఎదుర్కొన్న సవాళ్లను, అవమానాలను ఏకరువు పెట్టారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వంపై ఆమె చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే, ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నా చౌక్‌ను ఎత్తేయడం, ప్రజల గొంతుకను నొక్కేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వంలో అహంకారం పెరిగిపోయిందని, సహనశీలత కరువైందని విమర్శించారు. సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న కామెంట్ పెట్టినా లేదా చిన్న మాట మాట్లాడినా, పోలీసులను పంపి వారిని అరెస్ట్ చేయించి కొట్టించిన సందర్భాలను ఆమె గుర్తు చేశారు. ఇటువంటి నిరంకుశ పోకడలు తెలంగాణ ప్రజలకు నచ్చలేదని, అందుకే వారు గత ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేశారని కవిత విశ్లేషించారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం పనికిరాదని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తాము మొదటి వరుసలో గౌరవం దక్కుతుందని ఆశించామని, కానీ దానికి భిన్నంగా జరిగిందని కవిత అన్నారు. ఉద్యమ ద్రోహులు, సమైక్యాంధ్ర వాదులు పార్టీలోకి రావడం, వారే పదవులు అనుభవించడం ఉద్యమకారులకు తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. కేశవరావు జాదవ్ వంటి మహనీయులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడం బాధాకరమన్నారు. అలాగే, జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లేదా కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం తెలంగాణ దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పక్కన కోదండరామ్ సార్, ఆకునూరి మురళి ఉండటం చూసి ఉద్యమకారులు నమ్మారని, కానీ నేడు వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా న్యాయం జరగడం లేదని విమర్శించారు.
తెలంగాణ జాగృతి తరపున ఆమె కొన్ని కీలక డిమాండ్లను, ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అమరవీరుల కుటుంబాలకు రూ. 25,000 పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా ప్రకటన చేయాలి. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల నివేశన స్థలం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలి. తెలంగాణలోని ప్రైవేట్ సంస్థలలో స్థానిక యువతకు 20% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను గుర్తించడానికి తాము ఒక ‘యాప్’ను లాంచ్ చేశామని, ఇందులో నమోదైన వారికి తెలంగాణ జాగృతి తరపున ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని ప్రకటించారు.
తాను భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కవిత ప్రకటించారు. అది కేవలం అధికార కాంక్షతో కాకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి, ఉద్యమకారుల ఎజెండాను అమలు చేయడానికి పని చేసే ఒక రాజకీయ శక్తిగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డకు 150 ఏళ్ల పోరాట చరిత్ర ఉందని, రామజీ గోండు, కొమరం భీం, దొడ్డి కొమరయ్య వంటి వీరుల స్ఫూర్తితో మళ్లీ పిడికిలి బిగించి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను కాలరాశాడు. అహంకారం పెరిగి సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెట్టినా పోలీసులతో అరెస్ట్ చేయించారు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
KCR trampled democratic values. His arrogance grew to the extent that even a small comment on social media led to arrests… pic.twitter.com/yq8zoUGtTn
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2026