H-City Project: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ అధికారుల్లో ఏ మాత్రం ముందు చూపులేకుండా విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అసలే గడిచిన పదేళ్ల నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలో వృథా, దుబారా ఖర్చులకు ఇంకా అడ్డూఅదపు లేకుండా పోయిందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వేగంగా పట్టణీకరణ జరుగుతున్న హైదరాబాద్ మహానగరంలోని నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రూ. 1090 కోట్ల వ్యయం, పార్కు చుట్టూ 345 ఆస్తుల నుంచి స్థల సేకరణకు రూ. 800 కోట్ల స్థల సేకరణకు సిద్దమైన అధికారులు హెచ్ సిటీ పనులు మొదలైన తర్వాత హఠాత్తుగా ప్రతిపాదనల్లో భారీగా సవరణలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి, టెండర్లు కూడా ఖరారు చేసిన తర్వాత ప్రతిపాదనల్లో భారీ సవరణలు చేసిన సంగతి తెల్సిందే. దాదాపు పదేళ్ల క్రితమే సిద్దమైన ఈ హెచ్ సిటీ ప్రాజెక్టుల ప్రతిపాదనల రూపకల్పనకు ముందు ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించలేదా? అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఒక వేళ ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించి ఉంటే, ఆ ఫీజుబిలిటీ స్టడీలో వన్ వే అమలు ప్రస్తావన లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ వన్ వే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఫిజుబిలిటీ స్టడీ నిర్వహించి ఉంటే, ప్రాజెక్టుల డిజైనింగ్ లు, టెండర్ల ఖరారుకు ముందే వన్ వే అమలుకు ఎందుకు చొరవ చూపలేదన్న ప్రశ్న తలెత్తుంది.
ఈ హెచ్ సిటీ ప్రాజెక్టుల రూపకల్పన మొదలుకుని, డిజైనింగ్ లు, టెండర్ల ప్రక్రియ, ఆ తర్వాత క్షేత్ర స్థాయి పనులు వంటి అంశాలకు ఇప్పటి వరకు ఖర్చయిన వందల కోట్ల ఖర్చుకు బాధ్యులెవరన్నది హాట్ టాపిక్ గా మారింది. హెచ్ సిటీ పనుల్లో భాగంగా ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులకు ఎలాంటి అంతరాయం కల్గరాదన్న ఉద్దేశ్యంతో అనూహ్యాంగా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేసిన వన్ వేతో కేబీఆర్ పార్కు చుట్టూ ఇప్పటి వరకు నెలకున్న ట్రాఫిక్ సమస్యకు ఫుల్ స్టాప్ పడటం, ఎలాగో సమస్య పరిష్కారమైంది ఇక హెచ్ సిటీ పనులెందుకు? అన్న ఆలోచన రావటంతో ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భారీగా సవరణలు చేశారు. పైగా ఈ హెచ్ సిటీ పనులు పర్యావరణానికి పెను ముప్పుగా మారాయంటూ కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టుతో పాటు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. అయినా పార్కు పరిసర ప్రాంతాలకు ఆక్సిజన్ ను ప్రసాదించిన సుమారు 300 చెట్లను తొలగింపునకు బాధ్యులెవరు? అన్న చర్చ లేకపోలేదు.
Also read: బిగ్ టీవీ లోగోతో ‘DIG’ దందా.. సీఎం ఫ్యామిలీపై ఫేక్ ప్రచారం.. బీఆర్ఎస్ బడా నేత గుట్టురట్టు!
కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు జంక్షన్లలో అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు మొత్తం 345 ఆస్తుల నుంచి జీహెచ్ఎంసీ స్థలాలను సేకరించాల్సి ఉంది. వీటిలో నూటికి తొంభై శాతం ఆస్తులు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు చెందనవే ఉండటంతో ఆ ఆస్తుల నుంచి స్థలాలిచ్చేందుకు కొందరు విముఖత వ్యక్తం చేయటం, మరి కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ చెల్లించలేనంత నష్టపరిహారం డిమాండ్ చేయటం వంటి కారణాలతో స్థల సేకరణ ముందుకు సాగలేదు. తొలుత ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్(టీడీఆర్) లు జారీ చేసి స్థల సేకరణ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ నేరుగా చేసిన ప్రయత్నాలు వరుసగా విఫలయ్యాయి. దీంతో నష్టపరిహారం చెల్లించి స్థలాలను సేకరించాలని జీహెచ్ఎంసీ ప్రయత్నించినా, పలువురు అమాత్యులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక వెత్తల నుంచి వచ్చిన వత్తిడి కారణంగానే ప్రతిపాదనల్లో భారీగా సవరణలు చేసినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఓ సందర్భంలో కేబీఆర్ పార్కు చుట్టూ వందల కోట్ల ఖర్చుతో హెచ్ సిటీ పనులు చేపట్టడానికి బదులుగా పార్కు చుట్టూ వన్ వేను పకడ్బందీగా అమలు చేస్తే పార్కు చుట్టూ శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ గతంలో ప్రభుత్వంలోనే కొందరు పెద్దలు, జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సదరు ఐఏఎస్ ఆఫీసర్ సూచనలు, సలహాలను పక్కన బెట్టి హెచ్ సిటీ ప్రతిపాదనలను సిద్దం చేసి, జీహెచ్ఎంసీకి చెందిన వందల కోట్ల రూపాయలను వృధా చేయటంతో పాటు అంతకన్నా ఎక్కువ విలువైన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమయం కూడా వేస్ట్ చేశారన్న విమర్శలున్నాయి.
కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల ప్రతిపాదనను సవరించిన జీహెచ్ఎంసీ కేబీఆర్ పార్కు చుట్టూ ఒకే అండర్ పాస్, మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన విడివిడిగా ఉండే గ్రేడ్ సెపరేటర్ల స్థానంలో ఈ సమగ్ర కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్ ను రూ.580 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్దం చేయగా, కేవలం స్థల సేకరణకు రూ. 200 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ప్యాకేజ్–2లో భాగంగా ముగ్ధా జంక్షన్ నుంచి ఎన్ఎఫ్ సీఎల్ జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం. ఇందులో బంజారాహిల్స్ రోడ్ నెం.1కు ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)ల జారీతో స్థల సేకరణ జరుగుతుందా? లేక కాస్ట్లీ ఏరియా కావటంతో స్థల సేకరణకు మళ్లీ సమస్యలు ఎదురవుతాయా? వేచి చూడాలి.
Also read: వెదురు సాగుతో సిరుల వర్షం.. ఒక్కసారి నాటితే ఏళ్ల పాటు ఆదాయం!