Bamboo Farming: వ్యవసాయంలో కొత్త ఆదాయ మార్గాల కోసం చూస్తున్న రైతులకు వెదురు సాగు ఇప్పుడు ఆసక్తికరమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఒకప్పుడు అడవులు, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే వెదురు.. ఇప్పుడు వాణిజ్య పంటగా కూడా గుర్తింపు పొందుతోంది. పర్యావరణహిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల కోసం పరిశ్రమలు వెతుకుతుండటంతో వెదురుకు మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే, దీనిని చాలామంది పచ్చని బంగారం అని పిలుస్తున్నారు.
వెదురు సాగులో రైతులకు అనుకూల అంశం ఒక్కసారి నాటితే ఏళ్లుగా ఆదాయం పొందే అవకాశం ఉండటం. సరైన రకాన్ని ఎంచుకుని మొక్కలను నాటిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు మొక్కల పెరుగుదలపై దృష్టి పెట్టాలి. సాధారణంగా కోతకు రావడానికి సుమారు 3 నుంచి 5 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ తర్వాత ఒకే వేర్ల వ్యవస్థ నుంచి కొత్త కాండాలు రావడంతో నిరంతరంగా కోతలు తీసుకునే అవకాశం ఉంటుంది. సరైన నిర్వహణ ఉంటే ఒక వెదురు తోట చాలా సంవత్సరాల పాటు ఉత్పత్తి ఇస్తుంది. సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు కచ్చితంగా ఆదాయం వస్తుంది.
వెదురుకు ఒక్క వ్యవసాయ రంగంలోనే కాదు.. అనేక పరిశ్రమల్లో ఉపయోగం ఉంది. కాగితం తయారీ, ఫర్నిచర్, హస్తకళలు, నిర్మాణ రంగం, అగరబత్తీలు, ప్యాకేజింగ్ వంటి విభాగాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెదురు ఆధారిత బయోఎనర్జీ, బయోఫ్యూయల్ ఉత్పత్తులపై కూడా ఆసక్తి పెరుగుతోంది. పర్యావరణహిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో కొత్త మార్కెట్లు ఏర్పడే అవకాశం ఉంది.
వెదురు సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ బాంబూ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా వివిధ చర్యలు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మొక్కల సరఫరా, సాగు విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అయితే, సబ్సిడీ నిబంధనలు రాష్ట్రం, పథకం, రైతు అర్హతలను బట్టి మారవచ్చు. కాబట్టి సాగు ప్రారంభించే ముందు సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించడం అవసరం.
తక్కువ నీటి అవసరం, పురుగు మందులు, ఎరువు అసవరం లేని పంట కావడంతో వెదురు సాగు దీర్ఘకాలిక ఆదాయానికి అవకాశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న రైతులు, సరైన మార్కెట్ లింకేజీ ఉన్న ప్రాంతాల్లో దీనిని పరిశీలించవచ్చు. సరైన రకం, శాస్త్రీయ సాగు పద్ధతులు, నీటి నిర్వహణ, మార్కెట్ లింకేజీ, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన ఉంటే.. భవిష్యత్తులో వెదురు రైతులకు మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థలో వెదురుకు ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశముంది.
Read Also: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!