KCR New Plan: ఏపీ మాజీ సీఎం జగన్ బాటలో కేసీఆర్ వెళ్తున్నారా? ప్రతిపక్ష హోదా ఇస్తానంటే అసెంబ్లీకి వస్తానన్నది జగన్ మాట. తెలంగాణలో ప్రతిపక్ష హోదా ఉన్నా.. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు? ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడడం ఖాయమా? ఆ భయంతో అసెంబ్లీకి రావాలని నిర్ణయించు కున్నారా? అవుననే అంటోంది అధికార పార్టీ.
బీఆర్ఎస్‌లో ప్లానేంటి?
బీఆర్ఎస్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి మారబోతోంది. జనంలో లేకుంటే పార్టీకి కష్టాలు తప్పవని భావించారు. అందుకోసమే ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు కారు పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీ మిగేస్తుందని ఎందుకు భయపడుతున్నారు? అందుకే ప్రజాక్షేత్రం లోకి రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఫామ్ హౌస్ నుంచి జనంలోకి వస్తానంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు అధికారం చెలాయించిన ఆయన, తనకు ఎదురులేదని భావించారు. అధికారం పోగానే దాదాపు ఏడాదికి పైగా ఫామ్‌హౌస్‌కు పరిమితమ య్యారాయన. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాననడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి?
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతో కుంగిపోతున్న పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడానికా? కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవడానికా? అనర్హత వేటు భయంతో అసెంబ్లీకి రావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి.
ALSO READ: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, అందుకేనా?
సంకేతాల వెనుక
ఫిబ్రవరిలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. దీంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తాజాగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు తాను స్వయంగా హాజరవుతానని చెప్పుకొచ్చారు. సభలో ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి పాతికేళ్లు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న వరంగల్‌లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కొందరు నేతలకు సూచించారు. ఏడాదికి పైగా ఫామ్‌హౌస్‌కి పరిమితమైన కేసీఆర్, తిరిగి యాక్టివ్ అవుతారని అంటున్నారు.
ప్రమాణ స్వీకారం సమయం, ఆ తర్వాత బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఉన్నకొద్దిసేపు ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్లిపోయారాయన. ఆరు నెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడనుంది. ఆ భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు సభకు వచ్చారన్న ప్రచారం లేకపోలేదు.
జగన్ బాటలో కేసీఆర్?
కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రతిపక్షనేతగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారా? లేకపోతే మళ్లీ హాజరు కోసమే వస్తారా? అన్నదానిపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అన్నట్లు ఏపీలో కూడా మాజీ సీఎం జగన్ ఇలాగే చెప్పారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఒకరోజు వచ్చారు.. అటెండెన్స్ వేసుకుని వెళ్లారు. జగన్ తరహాలో సభలో అలా కనిపించి ఇలా వెళ్లిపోతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని ప్రభుత్వంతోపాటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి.