MLC Kavitha: బీఆర్ఎస్‌లో కలహాలు తారాస్థాయికి చేరాయా? హరీష్‌రావుపై కేసు నమోదు కావడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కవితకు రూట్ క్లియర్ అయ్యిందా? లీడర్ షిప్ కోసం ఫ్యామిలీలో జరిగిన చర్చ ఏంటి? కేటీఆర్ తర్వాత కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారు? తొలుత కేటీఆర్‌కే పగ్గాలు అందుకుంటారని నేతలు భావించారు. ఈలోగా కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? అధినేత ఆలోచన ప్రకారమే అంతా జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
అధికారం పోయిన తర్వాత కారులో భారీగా కుదుపులు మొదలయ్యాయి. ఓ వైపు నేతలు వలసలు.. మరోవైపు లీడర్ షిప్ కోసం ఎత్తుకు పైఎత్తులు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్‌ని ఎదుర్కోవాలంటే కేటీఆర్ బెటరని భావించారు పెద్దాయన.
కేటీఆర్ రంగంలోకి దిగేశారు.. ప్రతీ విషయాన్ని భూతద్దంతో చూపించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు వచ్చినట్టు ప్రచారం సాగింది. అదే క్రమంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు చుట్టుకోవడం, ఆపై కేసు నమోదు కావడం జరిగిపోయింది.
ALSO READ: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు లోతుగా జరుగుతోంది. రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమంటూ ప్రచారం సాగింది. ఒకవేళ కేటీఆర్ అరెస్టయితే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడ్డారట. హరీష్‌రావుకి పగ్గాలు అప్పగించేందుకు కేటీఆర్, కవిత మొగ్గు చూలేదని గుసగుసలు.
పార్టీ పగ్గాలు కొద్దిరోజులపాటు కవితకు ఇస్తే బెటరని కేటీఆర్, కేసీఆర్ చర్చించుకున్నా రట. ఆ తర్వాత ఆమె పేరు తెరపైకి రావడం, ఆపై తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశం కావడం చకచకా జరిగిపోయాయి.
బుధవారం నుంచి ఐదురోజులపాటు ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు కవిత. డిసెంబర్ నాలుగున వరంగల్, నిజామాబాద్ జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. 5న కరీంనగర్, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్, 7న హైదరాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల నేతలతో సమావేశాలు జరపనున్నారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాలను హరీష్‌రావు వర్గీయులు గమనిస్తున్నారు. అయితే మంగళవారం చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్‌రావుపై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో కవితమ్మకు లైన్ క్లియర్ అయ్యింది.
ఈ క్రమంలో కేసీఆర్ తన కూతురుకు కొన్ని సలహాలు, సూచనలు చేశారట. దాని ప్రకారమే అడుగులు వేస్తోందామె. రేవంత్ సర్కార్ ఏడాది సందర్భంగా బీఆర్ఎస్‌లో చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఏడాదిపాటు పార్టీని నడిపించిన కేటీఆర్.. ఇప్పుడు దూరంగా ఉన్నారు.
పార్టీ పగ్గాలు కవిత చేతికి వచ్చాయి. ఈమె కూడా ఏడాది పాటు కొనసాగుతారా? మధ్యలో మళ్లీ ఏమైనా మార్పులు జరుగుతాయా? అన్న ప్రశ్నలు గులాబీ శ్రేణుల్లో మొదలైపోయింది. పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై గులాబీ నేతలు గమనిస్తున్నారు.