ట్యాపింగ్ కేసు!
హరీష్ పాత్రపై ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
⦿ తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం
⦿- హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
⦿ సిద్దిపేట నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు నేపథ్యంలో నమోదు
⦿ హరీష్ రావుతోపాటు ఎఫ్‌ఐఆర్‌లో రాధాకిషన్ రావు పేరు
⦿ ఫోన్లు ట్యాప్ చేసి అక్రమ కేసుల బనాయింపు
⦿ చంపేస్తానని బెదిరించిన రాధాకిషన్ రావు
⦿ హరీష్ రావు, శ్రవణ్ రావు లింక్స్‌పై ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
⦿ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో వ్యవహారాలూ బయటకు
⦿ అడ్డంగా దొరికిపోయినా కూడా బుకాయింపు మాటలు
⦿ పదేళ్లలో మీరు పెట్టిన అక్రమ కేసులపై స్పందిస్తారా?
⦿ హరీష్ రియాక్షన్‌పై కాంగ్రెస్ నేతల కౌంటర్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Phone Tapping Case: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. హరీష్‌తోపాటు ట్యాపింగ్ కేసులో నిందితుడైన రాధాకిషన్ రావుపై 120 బీ, 386, 409, ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు, ఇంకా ఇతర బీఆర్ఎస్ నేతల పాత్రపై ‘స్వేచ్ఛ’ అనేక ఇన్వెస్టిగేటివ్ కథనాలు ప్రచురించింది. పక్కా ఆధారాలతో అన్నీ జనం ముందు ఉంచింది. ఇప్పుడు కేసు ఆ దిశగానే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
హరీష్‌పై ఫిర్యాదు.. కేసు నమోదు
గత నెల 18న సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై వివరాలు పోలీసులకు అందించారు. గతంలో ఓసారి డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీని కలిసి ఈయన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి తర్వాత వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తన ఫోన్‌ను హరీష్ రావు ట్యాప్ చేసినట్టు పేర్కొన్నారు చక్రధర్ గౌడ్. ఆయన ఇచ్చిన ఆధారాలను స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హరీష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు ఫైల్ అయింది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ గౌడ్ కీలక విషయాలను పోలీసులకు వివరించారు.
చక్రధర్ గౌడ్ వాదన ఇదే!
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేటలో వార్ రూం ఏర్పాటు చేశారు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ రావు. తర్వాత తన ఫోన్ ట్యాప్ చేశారని అంటున్నారు చక్రధర్ గౌడ్. హరీష్ రావు దగ్గరుండి ఇదంతా చేయించారని ఆరోపించారు. ఆయనకు రాజకీయంగా అడ్డు వస్తున్నానని కక్షగట్టి ఇలా చేశారని, ఆయన్ను జైల్లో వేయాలని కోరారు. 2023 నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ పైన కొట్లాడుతున్నానని, గతంలో డీజీపీకి వినతిపత్రం ఇచ్చానని చెప్పారు. న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లానన్నారు.
తన ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయ్యాయని, రాధాకిషన్ రావు చంపుతా అని బెదిరించాడని తెలిపారు. తన మీద అత్యాచారం కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. హరీష్ రావు ఎన్నో కుటుంబాలను, వ్యాపారస్తులను లొంగదీసుకున్నారని, తన మీద 6 కేసులు పెట్టించారని ఆరోపించారు చక్రధర్ గౌడ్. అనేక ఇబ్బందులు పెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేశారని అన్నారు. హరీష్ రావుతో తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి విన్నవించుకున్నానని, ఆయనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి అని చెప్పారు.
హరీష్ రావు, శ్రవణ్ రావు మధ్య డీలింగ్స్
ఆనాడు కేవలం నాయకులు మాత్రమే కాదు, అధికారులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. నేరుగా ఫోన్‌లో మాట్లాడటానికి భయపడి, వాట్సాప్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడినా కూడా, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్)తో ఇంటర్ నెట్ కాల్స్‌ని కూడా వినే ప్రయత్నం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీష్ రావు ఆదేశం మేరకు ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ నేరుగా ప్రభాకర్ రావుతో టచ్‌లోకి వెళ్లారు. శ్రవణ్ కుమార్, ప్రణీత్ రావుతో సహా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలోని అధికారులతో నేరుగా మాట్లాడి బీజేపీ, కాంగ్రెస్ నేతలు, మద్దతు దారుల సమాచారం, వారి రాజకీయ వ్యూహాలు, ఆర్థికంగా సాయపడే వ్యక్తుల వివరాలు సేకరించారు. అలాగే, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేస్తున్న వ్యక్తుల వివరాలను, వారి ఫోన్ సంభాషణలను సేకరించే ప్రయత్నమూ చేశారు. ఈ విషయాలన్నీ గతంలోనే ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది.
హరీష్ రావు పాత్రపై అనుమానాలెన్నో!
బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాప్ చేశారు. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. బీఆర్ఎస్‌కు అనుకూలంగా అధికారులతో పని చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ నిందితుల కన్ఫెషన్ రిపోర్టుల ద్వారా బయటకు వచ్చాయి. కేటీఆర్, హరీష్ రావు సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కాంగ్రెస్ నేతల వాదన. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను ఎలా తప్పుదారిన వాడుకున్నారో ఇదే నిదర్శనమని విమర్శించారు.
Also Read: Ranganath on Hydra: ఆక్రమణలు తొలగిస్తాం.. వరద ముప్పును జయిస్తాం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించడమే కాకుండా ప్రత్యేక పరికరాలు తెప్పించి ట్యాపింగ్‌కు పాల్పడ్డారని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా హరీష్ రావుపై కేసు నమోదు కావడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కానీ, ఆయన మాత్రం ఇది అక్రమ కేసుగా కొట్టిపారేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పదేళ్లలో మీరు పెట్టిన అక్రమ కేసులపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నారు.