E-Paper
Advertisement

KCR: చంద్రబాబు మాట వినే.. కేంద్రం అలా చేసింది.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: చంద్రబాబు మాట వినే.. కేంద్రం అలా చేసింది.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమర్శించారు. రెండేళ్ల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.

‘ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధాన కారణం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఏంటని?. రాష్ట్రంలో అత్యంత దారుణ పరిస్థితులకు లోనైన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణా నది ఈ జిల్లా నుంచే రాష్ట్రంలోకి వస్తుంది. జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది పారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు చేసిన ద్రోహం. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు వివక్షకు గురైంది. ప్రతిపాదించిన ప్రాజెక్టుల ఎస్ఆర్సీ మార్చొద్దని కోరాం. గతంలో నీటి కేటాయింపు జరిగాయి. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను చాలాసార్లు కోరాం. పాలమూరుకు 174 టీఎంసీలు రావాల్సి ఉంది.

17 టీఎంసీలు జూరాల ప్రాజెక్టు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది. అంజయ్య ప్రభుత్వం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. సీఎం చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. చాలా పునాది రాళ్లు వేశారు. ఆ పునాది రాళ్లను కృష్ణా నదిలో వేస్తే చెక్ డ్యామ్ అవుతుందని ఉద్యమ సమయంలో నేను అంటే నవ్వుకునేవారు. పాలమూరు నుంచి ప్రజలు ముంబైకి వలస పోయేవారు. ఉద్యమ కవులు పాలమూరు కరువుపై చాలా పాటలు రాశారు’ అని కేసీఆర్ అన్నారు.

అంతా చంద్రబాబు పనే

‘సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి అని అప్పట్లో చంద్రబాబు స్లోగన్ ఇచ్చారు. నేను ఓ సభలో జూరాల ప్రాజెక్టు కోసం కర్ణాటకకు కాంపన్సేషన్ ఎందుకు కట్టరని ప్రశ్నిస్తే.. చంద్రబాబు మోకాళ్లపై పరుగులు పెట్టి కాంపన్సేషన్ కట్టారు. ఆర్డీఎస్ కోసం నేను గొడవ చేస్తే.. జూరాలకు లింక్ కెనాల్ స్టార్ చేశారు.

ఇలా కొట్లాడితే.. చివరకు తెలంగాణ ఏర్పడింది. పాలమూరు జిల్లాను దరిద్రంలోకి నెట్టివేశారు. తెలంగాణ వెనుక బడిన ప్రాంతం కాదు వెనుకపడేయబడిన ప్రాంతం. పాలమూరులో కొన్ని సంవత్సరాల క్రితం గంజి కేంద్రాలు పెట్టారు. కృష్ణా నది 300 కి.మీ పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి చేరిపోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులు అని పేరు పెట్టారు’ -కేసీఆర్

పాలమూరును వలసల జిల్లా చేశారు

“తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తిగా సర్వే చేశాను. పాలమూరు జిల్లాను బయటపడేసేందుకు కృషి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6.5 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాము. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఫేజ్-1,2 ద్వారా లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చాం. 300 కిలో మీటర్ల కృష్ణా నది ఉన్న జిల్లాలో 30 ఎకరాల సాగు కూడా లేదు. అందుకే పాలమూరును వలసల జిల్లా అనేవారు. మిషన్ కాకతీయలో పాలమూరుకు టాప్ ప్రయారిటీ ఇచ్చాం. చాలా వాగులపై చెక్ డ్యామ్ లు కట్టాం. తుంగభద్రపై తుమ్మిళ్ల లిఫ్ట్ స్టార్ట్ చేసి ఆయకట్టుకు పారించాం” -కేసీఆర్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు

“రంగారెడ్డి జిల్లా కూడా కృష్ణా నది ఆయకట్టే. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు కృష్ణా నది ఆయకట్టులోనే ఉన్నాయి. అందుకే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల వాటాలపై కొట్లాడాలని నిర్ణయించాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 174 టీఎంసీలు తీసుకోవాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ స్ట్రాటజీ. పాలమూరు చెరువుల లెక్కలు తీసి కేంద్రానికి చెప్పాం. అప్పటి లెక్కల ప్రకారం 90.81 టీఎంసీలు పాలమూరు-రంగారెడ్డికి కేటాయించాం. ఆంధ్రా వాళ్లు లిఫ్ట్ పెట్టి 80 టీఎంసీలు వాడుకుంటున్నారు. పోలవరం నుంచి ఏపీ నీళ్లు తీసుకుంటుందని.. కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా నీళ్లు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయనం చేసి పాలమూరు-రంగారెడ్డికి 90.81 టీఎంసీలు కేటాయించాం.

ఈ ప్రాజెక్టుకు 145 మెగావాట్స్ కెపాసిటీతో పంపులు పెట్టాం. దేశంలో ఎక్కడా ఇలాంటివి. ఏపీతో పోతిరెడ్డిపాడు, తెలుగు గంగా పంచాయితీ ఉంది కాబట్టి.. ఇంత కెపాసిటీ పంపులు పెట్టి కాలువలు నింపాం. ఈ ప్రాజెక్టు కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేసి, 27 వేల కోట్లు ఖర్చుపెట్టాం. ఇంతలో మా ప్రభుత్వం మారింది. ఇంత ఖర్చు పెట్టిన ప్రాజెక్టును ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిలో ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు” అని కేసీఆర్ విమర్శించారు.

తెలంగాణకు బీజేపీ శని

“కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు శనిలా తయారైంది. ప్రాజెక్టు కావాల్సిన అనుమతులు కూడా తెచ్చాం. అన్ని వచ్చిన తర్వాత కూడా.. కేంద్రంలోని బీజేపీ చంద్రబాబు మాటలు పట్టుకుని డీపీఆర్ వాపస్ పంపారు. డీపీఆర్ వాపస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత హడావుడి చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. వడ్లు కొనకపోతే బీఆర్ఎస్ దిల్లీలో పోరాటం చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని విభజన అంశాలు ఉంటాయి. నీటి తగాదాలపై మేము ఒక డిసైడ్ చేశాం. ఒక సంవత్సరం తర్వాత కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశాం. కానీ స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాం. కోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసింది. నీటి పంపకాలు చేయండని సుప్రీంకోర్టు చెప్పడంతో.. కేంద్రం నీటి కేటాయింపులపై సెక్షన్ 3 వేసింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి. తొందరలో తీర్పు వస్తుంది”- కేసీఆర్

Also Read: KCR: నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, పాలు-నీళ్లు ఏవో జనాలకు అర్థమైంది: కేసీఆర్

45 టీఎంసీలు అంటూ

“75 శాతం నీటి ఆధారితంపై కేటాయింపులు జరగాలి. కానీ బ్రిజేష్ కుమార్ ఏం చెప్పారంటే వర్షాలు బాగా పడుతున్నాయని 65 శాతానికి మార్చారు. దీంతో మనకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరుగుతుంది. దీంతో పాలమూరుకు 170 టీఎంసీల వరకూ రావాలి. పాలమూరులోని నియోజకవర్గానికి లక్ష ఎకరాలు నీళ్లు పారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డీపీఆర్ వెనక్కి పంపితే ఈ దద్దమ్మ ప్రభుత్వం చప్పుడు చేయడంలేదు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి 45 టీఎంసీలు ఇవ్వాలని కేంద్రానికి లెటర్ రాశారు. మనకు రావాల్సిన వాటా కంటే తక్కువగా వాటా అడుగుతున్నారు. ట్రైబ్యునల్ తీర్పుతో వచ్చిన వాటాను కూడా ఎందుకు ఆపుతున్నారు. ఎప్పుడూ రియల్ ఎస్టేట్ దందా తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లెక్కలేదా? ఎందుకు ప్రాజెక్టులు కట్టడంలేదు. దీని వెనుక ఏం కుట్ర ఉంది. రెండేళ్ల నుంచి నేను మౌనంగా ఉన్నాం. ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమయ్యా. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలో భారీ బహిరంగ సభలు, గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం” అని కేసీఆర్ అన్నారు.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×