KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఇంటా బయటా కష్టాలు మొదలయ్యాయా? కొద్దిరోజులు పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలని ఆయన భావించారా? మనం ఒకటి తలస్తే.. దైవం మరొకటి తలచిందా? అమెరికా ఎంబసీ అధికారులు, కేసీఆర్ వీసాను ఎందుకు రిజెక్ట్ చేశారు? కేసీఆర్ బాటలో హరీష్‌రావు అమెరికా వెళ్లేందుకు డ్రాపవుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మే నెల చివరలో అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. అందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మనవళ్ల గ్రాడ్యుయేషన్ సెరిమనీతోపాటు పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడులకు హాజరుకావాలని భావించారు. తాజాగా బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేసీఆర్ వీసాను అమెరికా రాయబార కార్యాలయం తిరస్కరించింది.
కేసీఆర్ వీసా రిజెక్ట్
అమెరికా టూర్ కోసం రెండు నెలల కిందట సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీసుకు వెళ్లారు కేసీఆర్ దంపతులు. ఆ కేంద్రంలో పాస్‌పోర్టు పునరుద్ధరణ చేసుకున్నారు. యూఎస్ వెళ్లడంతో మనవాళ్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారట కేసీఆర్.
కేసీఆర్ వీసా తిరస్కరణతో ఆయన అమెరికా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. తొలుత నార్త్ కరోలినాలో కవిత కుమారుడి గ్రాడ్యుయేషన్ సెరిమనీ కార్యక్రమానికి హాజరు కావాల్సివుంది. ఆ తరువాత న్యూయార్క్ లో కేటీఆర్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ALSO READ: రాజ్‌భవన్‌లో దొంగలు పడ్డారు.. నాలుగు హార్డ్ డిస్కులు మాయం
జూన్ ఒకటిన తెలంగాణ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం డల్లాస్‌లో నిర్వహించే BRS పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సైతం హాజరు కావాలని భావించారు కేసీఆర్. వీసా రిజెక్ట్ కావడంతో ఆశలన్నీ అడియాశలయ్యాయి.
సిల్వర్ జూబ్లీ వేడుకలకు దూరంగా కవిత?
డల్లాస్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు కేవలం కేటీఆర్ మాత్రమే హాజరుకానున్నట్లు ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తెలిపింది. కేసీఆర్ వీసా రిజెక్టు అయిన విషయం తెలియగానే పలువురు ఎన్నారైలు నిరాశలో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్లేందుకు రెడీ అయ్యారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న కవిత మాత్రం డల్లాస్‌లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకకు హాజరుకావడం లేదని పార్టీ వర్గాల మాట. కేసీఆర్‌కు వీసా రాకపోవడంతో హరీశ్‌రావు కూడా అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.
మూడు రోజుల కిందట హరీశ్‌రావు ఇంటికి వెళ్లారు కేటీఆర్. ఇరువురు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేసీఆర్ వీసా వ్యవహారం, కవిత సిల్వర్ జూబ్లీ వేడుకకు హాజరుకాకపోవడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక.