E-Paper
Advertisement

కిషన్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఖైరతాబాద్ పోరులో కమలం టాప్ గేర్!

కిషన్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఖైరతాబాద్ పోరులో కమలం టాప్ గేర్!
Advertisement

Khairatabad Bypoll:స్వేచ్ఛ బ్యూరో: ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ  ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఒక కీలక అవకాశంగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటుతుందా? లేక మరోసారి ఎదురుదెబ్బ తప్పదా? అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న చర్చ, బీఆర్‌ఎస్‌కు సరైన అభ్యర్థి దొరకడం కష్టమవుతోందన్న ప్రచారం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అవకాశాన్ని కమలనాథులు ఏ మేరకు అందిపుచ్చుకుంటారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

ఉప ఎన్నికలపై బీజేపీ వ్యూహం..

Advertisement

ఖైరతాబాద్ ఉప ఎన్నికను బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ.. ఈసారి మాత్రం పోటీలో తన స్థాయిని పెంచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇదిలాఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. దీంతో ఈ ఉప ఎన్నికలో ఆయన పాత్ర కీలకంగా మారనుంది. నియోజకవర్గంలో పార్టీకి గతంలో ఉన్న బలం, ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఓటును తమ వైపు మళ్లించుకోవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందన్నదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి ప్రభావం..

Advertisement

ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఈ ఉప ఎన్నికపై ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ పరిధిలోని ఈ సెగ్మెంట్‌లో బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంలో కిషన్‌రెడ్డి తన మార్క్ చూపుతారా? పార్టీ అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆయన వ్యూహం ఏ మేరకు పనిచేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం కూడా ఖైరతాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇదిలాఉండగా కొత్త బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ్‌ల ప్రభావం ఈ ఎన్నికపై ఏ మేరకు ఉంటుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఉప ఎన్నికను అభ్యర్థి బలంతో పాటు సంస్థాగత యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపి ఎదుర్కొనే దిశగా పార్టీ అడుగులు వేస్తే విజయతీరాలకు చేరవచ్చని శ్రేణులు భావిస్తున్నాయి.

బీఆర్ఎస్ కు సవాలుగా మారిన అభ్యర్థి ఎంపిక

మరోవైపు బీఆర్‌ఎస్‌కు అభ్యర్థి ఎంపిక సవాలుగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన స్థానంలో బలమైన ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలోకి దింపడం పార్టీకి కీలకంగా మారింది. స్థానికంగా పరిచయం, వ్యక్తిగత ఓటు బ్యాంకు, పార్టీ కేడర్‌ను సమన్వయం చేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్ అన్వేషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌లో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, గతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రజల స్పందన ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత అనే చర్చ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానం నాగేందర్ పోటీ చేస్తారా? లేదా? ఆయనకు బదులు మరెవరికైనా టికెట్ ఇస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రేసులో పలువురి నేతల పేర్లు..

బీజేపీలో మాత్రం టికెట్ కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చికోటి ప్రవీణ్, ఇంద్రసేనారెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. వీరందరిలో టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. చింతల రామచంద్రారెడ్డికి నియోజకవర్గంతో ఉన్న పాత అనుబంధం ఒక అంశంగా ఉంటే.. ఆయనకు పార్టీ 4 సార్లు అవకాశమిస్తే.. ఒక్కసారి మాత్రమే గెలవడం గమనార్హం. అయితే.. 74 ఏళ్ల వయస్సు ఉన్న ఆయనకు పార్టీ మళ్లీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. టికెట్ల కేటాయింపులో పార్టీ సీనియారిటీకి అవకాశం కల్పిస్తుందా? లేక ప్రస్తుతం కొనసాగుతున్న జెన్ జీ ట్రెండ్ కు అనుగుణంగా కొత్త వారికి అవకాశం ఇస్తుందా? అనే అంశంపై చర్చ సాగుతోంది. సరైన అభ్యర్థిని బరిలోకి దింపితే ఖైరతాబాద్‌లో బీజేపీకి గెలుపు అవకాశాలు బలపడతాయని ఆ పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమవుతోంది. ఒకవైపు పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా కనిపిస్తుంటే.. మరోవైపు అభ్యర్థి ఎంపిక, స్థానిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు కీలకంగా మారనున్నాయి. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ సిక్స్ కొడుతుందా.. లేక సెమీ ఫైనల్‌లోనే డకౌట్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

Also Read: పరాయి మహిళలతో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య సూసైడ్!

Tags

Related News

మహిళను ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసాడు.. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు!

మరీ ఇంత దారుణమా.. సూర్యపేట జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్!

డిజిటల్ తెలంగాణలో లైవ్ స్టాక్ చీకట్లు.. ఏళ్లు గడుస్తున్నా లేని వెబ్‌సైట్!

గణేష్ శోభాయాత్రలో చిందులేసిన సీపీ సజ్జనార్.. వీడియో వైరల్!

పరాయి మహిళలతో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య సూసైడ్!

రైస్ మిల్లర్ల సమ్మెతో చిక్కుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడైనా కొలిక్కివచ్చేనా..?

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

Big Stories

Advertisement
×