Crime Thriller Movie: రాత్రి సమయంలో ఓ చనిపోయిన వ్యక్తి మృతదేహానికి కాపలా కాయాల్సిన బాధ్యత ఓ చిన్న పోలీస్ అధికారికి అప్పగిస్తారు. అంతా ప్రశాంతంగానే ఉందనుకున్న సమయంలో తెల్లారేసరికి అక్కడ బాడీ కనిపించదు. దాన్ని ఎవరు తీసుకెళ్లారు ? అసలు ఆ శవం వెనుక ఉన్న కథ ఏంటి ? ఇలా దాన్ని వెతికే క్రమంలో బయటపడే నిజాలు మరింత షాక్ ఇస్తాయి. చిన్న పట్టణం, అక్కడి పోలీసులు, ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టిన అక్రమాలు… వీటన్నింటినీ కలుపుతూ సాగే క్రైమ్ మిస్టరీనే ‘ది డిప్యూటీ’ (The Deputy) మూవీ. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అసలు కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
టోబీ సాయర్ పార్ట్‌టైమ్‌గా డిప్యూటీగా పని చేస్తుంటాడు. ఓ రాత్రి చీఫ్ క్రూగర్ అతడిని నిద్రలేపి, ఓ మృతదేహానికి కాపలా కాయాలని ఆదేశిస్తాడు. కరోనర్ వచ్చే వరకు బాడీ అక్కడే ఉండాలి. జస్ట్ కాపలా కాయడమే కదా… పెద్దగా పని ఏమీ లేదనుకున్న టోబీకి కొద్దిసేపటికే సమస్య మొదలవుతుంది. శవాన్ని అక్కడ పెట్టి గంట కూడా కాకుండానే ఆ మృతదేహం కనిపించకుండా పోతుంది. శవం మాయమవడంతో టోబీపై అనుమానాలు మొదలవుతాయి. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయలేకపోయాననే సమస్య ఒకవైపు ఉంటే… అసలు బాడీ ఎక్కడికి వెళ్లిందనే ప్రశ్న మరోవైపు వెంటాడుతుంది.
దీంతో టోబీ స్వయంగా దాని కోసం వెతకడం మొదలుపెడతాడు. అయితే ఆ వెతుకులాట అతడిని ఊహించని దారుల్లోకి తీసుకెళ్తుంది. ఓ ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న వలసదారులు, డబ్బుతో నిండిన ఫ్రీజర్, ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు… ఇలా ఒక్కో విషయం బయటపడే కొద్దీ ఆ పట్టణం గురించి టోబీకి ఉన్న అభిప్రాయం మారిపోతుంది. ముఖ్యంగా కొంతమంది పోలీసులు కూడా ఈ వ్యవహారాలను చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అతడికి అర్థమవుతుంది. డిప్యూటీ బిల్లీ బ్యాంక్స్ కూడా టోబీని ఈ వ్యవహారం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తాడు.
అయితే డిప్యూటీ అమాండా జాక్సన్ మాత్రం టోబీకి అండగా నిలుస్తుంది. కనిపించకుండా పోయిన మృతదేహం కోసం మొదలైన అన్వేషణ చివరికి ఆ పట్టణంలో ఏళ్లుగా దాగి ఉన్న అవినీతి, నేరాల చరిత్రను బయటకు తీస్తుంది. ఉద్యోగాన్ని కాపాడుకోవడమే కాకుండా తన ప్రాణాలను కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితిలో టోబీ పడతాడు. మరి అసలు ఆ శవం ఏమైంది ? చివరికి దొరికిందా లేదా ? దానివల్ల హీరోకి ఎదురైన సమస్యలు ఏంటి ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
డ్యూక్ నికల్సన్, విలియం హెచ్. మేసీ, టిఫనీ హడిష్, స్టీఫెన్ డార్ఫ్, జూలియా ఫాక్స్ తదితరులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు మ్యాట్ సుక్కర్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న థియేటర్లతో పాటు డిజిటల్ VODలోనూ విడుదలైంది. అంటే రెంట్ బేసిస్ లో ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఇండియాలో కాకుండా వేరే దేశాలలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్