Car letter l meaning rules: రోడ్డు మీద కారు నడపడం అనేది ఈ రోజుల్లో.. అత్యంత అవసరమైన నైపుణ్యాలలో ఒకటి. అయితే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు రోడ్డు మీదకు వచ్చినప్పుడు మిగతా వాహనదారులు అప్రమత్తంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైంది కార్లపై ‘L’ అక్షరాన్ని ఉంచడం.సింపుల్‌గా చెప్పాలంటే ‘L’ అంటే ‘లెర్నర్’ (Learner) అని అర్థం. అంటే ఆ కారును నడుపుతున్న వ్యక్తి ఇంకా డ్రైవింగ్ నేర్చుకునే దశలో ఉన్నారని, పర్ఫెక్ట్ డ్రైవర్ కాదని మిగతా వారికి హెచ్చరిక అన్నమాట. ఫస్ట్ టైమ్ స్టీరింగ్ పట్టుకుని ట్రాఫిక్ లోకి వచ్చే కొత్త డ్రైవర్లకు ఇది రక్షణ లాంటిది. తోటి వాహనదారులు దూరం పాటించేలా చేయడానికి ఈ సింబల్ ఎంతగానో హెల్ప్ అవుతుంది.
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి స్టీరింగ్ మీద, గేర్లు మార్చడంపై పూర్తి అవగాహన ఉండటానికి కొంత సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారు ఒక్క సారిగా బ్రేక్ వేయడం లేదా సడన్‌గా.. స్పీడ్ తగ్గించడం చేస్తుంటారు. వెనక వచ్చే ఇతర వాహనాల డ్రైవర్లు ముందు వెళ్తున్న కారు ‘L’ సింబల్‌ను గమనించి, తగినంత దూరం పాటించేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుంది. దీని వల్ల అనవసరమైన రోడ్డు ప్రమాదాలను ముందే నివారించవచ్చు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఎవరైనా లెర్నర్స్ లైసెన్స్ కలిగి ఉండి కారు నడుపుతున్నట్లయితే.. వారి వాహనానికి ముందు, వెనక స్పష్టంగా కనిపించేలా ఎరుపు రంగులో ‘L’ అక్షరాన్ని ఉంచడం తప్పనిసరి. ఒక వేళ ఎల్‌ఎల్‌ఆర్ లేకుండా లేదా ‘L’ బోర్డు పెట్టకుండా డ్రైవింగ్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు దొరికితే.. నిబంధనల ప్రకారం సుమారు రూ. 500 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రాంతాన్ని బట్టి ట్రాఫిక్ రూల్స్ మారొచ్చు.
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు , ఆటోమొబైల్ షాపుల్లో ఈ ‘L’ స్టిక్కర్లు లేదా మాగ్నెటిక్ బోర్డులు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒక సాధారణ రిఫ్లెక్టివ్ ‘L’ స్టిక్కర్ లేదా విండ్‌షీల్డ్‌కు పెట్టుకునే ప్లాస్టిక్ బోర్డు ధర కేవలం రూ. 50 నుండి రూ. 200 లోపే ఉంటుంది. వీటిని ఈజీగా కారు అద్దాలకు లేదా నెంబర్ ప్లేట్ దగ్గర అమర్చుకోవచ్చు. రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ మెటీరియల్‌తో వచ్చే బోర్డులు బెస్ట్.
Also Read: రైల్వే బోర్డులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా? ఆశ్చర్యపరిచే నిజాలు!
లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన ఉండాలి: లెర్నర్స్ లైసెన్స్‌తో కారు నడిపేటప్పుడు, పక్కన పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అనుభవజ్ఞుడైన వ్యక్తి కచ్చితంగా కూర్చోవాలి.
స్పీడ్ పరిమితులు: ‘L’ బోర్డు ఉన్న కారును నడిపేటప్పుడు ఎప్పుడూ నిర్ణీత వేగంలోనే, అతివేగానికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.
శిక్షణ పూర్తయ్యాక తొలగించాలి: డ్రైవింగ్ పూర్తిగా వచ్చి.. పర్మినెంట్ లైసెన్స్ వచ్చాక ఆ ‘L’ బోర్డును కారు నుంచి తొలగించాలి. లేదంటే ఇతర డ్రైవర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.
ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, మనతో పాటు రోడ్డుపై ప్రయాణించే తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి కూడా.. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లయితే.. కచ్చితంగా ఈ నిబంధనలను పాటించి సురక్షితమైన ప్రయాణాన్ని సాగించండి!