Khairatabad Ganesh Shobha Yatra: ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ టస్కర్ వాహనంపై ఈ 69 అడుగుల గణనాథుడిని తరలిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర.. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు సాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 5 వద్ద ఈ భారీ గణేశాను నిమజ్జనం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ, అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడ్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు శోభయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది భక్తులు దారిపొడవునా చేరుకొని.. గణనాథుడి ఆశీస్సులు పొందుతున్నారు. స్థానికులు తమ ఇళ్లు, భవనాలపైకి ఎక్కి.. ఈ శోభాయాత్రను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలోనే అతిపెద్ద గణనాథుడ్ని నిమజ్జనం చేసేందుకు అధికారులు సూపర్ క్రేన్ ను సిద్ధం చేశారు. గత ఐదేళ్లుగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ అతి భారీ క్రెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిమజ్జనం సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఈ సూపర్ క్రేన్ ను ఎన్టీఆర్ మార్గ్ కు తీసుకొచ్చినట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. కాగా గతంలో బ్రిడ్జిలు, భారీ రాళ్లు ఎత్తే పనుల్లో ఈ క్రేన్ ను వినియోగించడం గమనార్హం.
Also Read: పైసా ఖర్చు లేకుండా.. ఫుడ్ ఆర్డర్ చేసే కిక్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వింత వెబ్ సైట్!
గణనాథుల నిమజ్జనానికి ఇవాళే ఆఖరి రోజు కావడంతో.. ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథులు.. ట్యాంక్ బండ్ వైపునకు తరలివస్తుండంతో వాటిని తిలకించేందుకు భక్తులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. అలాగే గణనాథులను తీసుకొచ్చే ప్రధాన రహదారులు సైతం భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి.
Also Read: ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!