FoodNeverComes Website: ఒక్క ముద్ద ఆహారం కూడా ఇంటికి పంపని ఒక వింత వెబ్‌సైట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది. జూన్ నెలలో ప్రారంభమైన ‘ఫుడ్‌నెవర్‌కమ్స్’ (FoodNeverComes) అనే ఈ పోర్టల్‌ను ఇప్పటివరకు ఏకంగా 27 లక్షల మందికి పైగా సందర్శించారు. జొమాటో, స్విగ్గీ తరహాలోనే నూరూరించే తరహాలో ఫుడ్ మెసేజ్ పంపే ఈ వెబ్ సైట్ గురించి.. ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ సైట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వెబ్‌సైట్ పూర్తిగా ఒక వర్చువల్ ఫుడ్ డెలివరీ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 22 రకాల ఫేక్ కిచెన్లు, 327 డిష్‌లు, 319 నిజమైన వంటకాల వివరాలు ఉంటాయి. వినియోగదారులు మెనూ చూస్తూ నచ్చిన ఆహారాన్ని కార్ట్‌లోకి చేర్చి, బిల్లు పెరగడాన్ని గమనిస్తూ ఆర్డర్ చేయవచ్చు. అనంతరం వెంటనే ‘నేను మీ ఇంటి ముందే ఉన్నాను కానీ అడ్రస్ దొరకడం లేదు’ అంటూ ఒక ఫేక్ డెలివరీ బాయ్ (AI వాయిస్) నుండి కాల్ కూడా వస్తుంది. కాగా, ‘ఆహారం ఎప్పటికీ రాదు. కానీ డోపమైన్ కిక్ మాత్రం తప్పక వస్తుంది’ అనేదే ఈ సైట్ ప్రధాన స్లోగన్ కావడం విశేషం.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్లు పూర్వాంష్ పర్మార్, అంశుల్ శర్మ ఈ వినూత్న వెబ్‌సైట్‌ను రూపొందించారు. వారి సొంత అలవాట్లలో నుంచే ఈ ఐడియా పుట్టుకొచ్చింది. అంశుల్ తరచూ ఆన్‌లైన్ గ్యాడ్జెట్లను బాస్కెట్‌లో వేసి కొనకుండా వదిలేసేవారట. పూర్వాంష్ తల్లి కూడా ఇలాగే షాపింగ్ కార్ట్‌లు నింపి వదిలేసేదట. అటు పూర్వాంష్ ముంబైలో ఉన్నప్పుడు వారానికి 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఆహారంపై అనవసరంగా ఖర్చు చేసేవాడు. అసలు ఆకలి కంటే కూడా ఆర్డర్ చేసే ప్రక్రియలోనే అసలైన కిక్ ఉందనే విషయాన్ని వారు గుర్తించారు.
మనం ఒక వస్తువును లేదా ఆహారాన్ని అందుకోబోతున్నాం అని ఊహించుకోవడంలోనే మెదడుకు సంతోషం కలుగుతుందని యేల్ సెంటర్ ఫర్ కస్టమర్ ఇన్‌సైట్స్ డైరెక్టర్ రవి ధార్ పేర్కొన్నారు. మిచిగాన్ యూనివర్సిటీ న్యూరోసైంటిస్ట్ కెంట్ బెరిడ్జ్ ప్రకారం.. మెదడులో ఒకదాన్ని ‘కోరుకోవడం’ (Wanting), దాన్ని పొందాక ‘ఆస్వాదించడం’ (Liking) రెండూ వేర్వేరు ప్రక్రియలు. డోపమైన్ అనేది ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. స్టాన్‌ఫోర్డ్ మానసిక వైద్యురాలు అన్నా లెంబ్కే కూడా రివార్డ్ కోసం వేచి చూసే క్షణాలే డోపమైన్‌ను ప్రేరేపిస్తాయని వివరించారు.
ఇలాంటి ఫేక్ ఆర్డర్లు నిజమైన ఆర్డర్ పెట్టాలనే కోరికకు ప్రత్యామ్నాయమా? కాదా? అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కొద్దిరోజుల తర్వాత సదరు వెబ్‌సైట్‌పై ఆసక్తి తగ్గొచ్చని బెరిడ్జ్ అభిప్రాయపడగా.. మానసికంగా ఇది కొంత ఉపశమనం ఇవ్వొచ్చని రవి ధార్ అంటున్నారు. అయితే అన్నా లెంబ్కే మాత్రం ఇటువంటి సైట్లు పదే పదే వాడటం వల్ల పాత అలవాట్లే మరింత బలపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు.. 28 వేల మంది పోలీసులతో బందోబస్తు!
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ తరహా ‘డోపమైన్ సైట్ల’ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే సదరు డెవలపర్లు ‘ట్రిప్‌నెవర్‌లీవ్స్’ (TripNeverLeaves) అనే మరో సైట్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో యూజర్లు విహారయాత్రలను ప్లాన్ చేసుకుని, ఎప్పటికీ టేకాఫ్ అవ్వని విమానంలో ప్రయాణించినట్లు ఊహించుకోవచ్చు. దీనికి కూడా ఇప్పటికే లక్షకు పైగా సందర్శకులు వచ్చినట్లు సమాచారం.
Also Read: బాబోయ్.. ఇదేం ఖర్మరా బాబు.. సీరియల్ నటి నెటిజన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్..