KTR Remarks: స్వేచ్ఛ బ్యూరో: పోలీస్ స్టేషన్‌లో ఫొటోలు పెట్టాలంటే.. రౌడీ షీటర్లు, లంగలు, దొంగలు, మాట ఇచ్చి మోసం చేసినోళ్లవి పెట్టాలే. తులం బంగారం ఇచ్చి మోసం చేస్తే ఏం చేయాలే పోలీస్ స్టేషన్‌లో ఫొటో పెట్టాలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో తెలంగాణ భవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇయ్యాళ్ల కూడా పోలీసోళ్లు వద్దు.. మీ ఫొటోలు తీసుకుంటం. అవన్నీ తీసుకుపోయి ఏం చేస్తరో మరి నాకు తెల్వదు. ఫొటోలు తీసుకుంటమంటే కూడా ధైర్యంగా ఇక్కడికి వచ్చిర్రు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
ఆడవాళ్లందరికీ నెలకు రూ.2500 ఇస్తా అని చెప్పి మోసం చేస్తే ఆ ఫొటోలు పెట్టాలి. అత్తలకు రూ.4 వేలు, కోడళ్‌లకు రూ.2500 ఇస్తా అని లంగమాటలు చెప్పి ఓట్లేయించుకుంటే వాళ్ల ఫొటోలు పెట్టాలి. రైతులకు రూ.15 వేలు ఇస్తా అని కథలు చెప్పి మరి మోసం చేసి ఓట్లేయించుకుంటే వాళ్ల ఫొటోలు పెట్టాలే. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పట్టాలిస్తం.. పట్టాలొస్తయని అని చెప్పిండా లేదా..? అని అడిగారు. ఎస్టీ, ఎస్సీలు, బీసీలకు అసైన్డ్ భూములకు పట్టాలొస్తయి. ఇదివరకు ఇందిరమ్మ ఇచ్చింది.. ఇప్పుడు మళ్లిస్తం పట్టాలియ్యాల్సినోడు మోసం చేస్తే ఆయన ఫొటో పెట్టాల్నా.. మన ఫొటో పెట్టాల్నా పోలీస్ స్టేషన్‌లో అని అడిగారు.
ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు, 420 మాటలు చెప్పి గెలిచి గద్దెనెక్కి ఇవాళ గద్దలెక్క ప్రవర్తిస్తున్నోడిది పెట్టాల్నా మనది పెట్టాల్నా ఫొటోలు వాళ్లవే పెట్టాలే కాబట్టి పోలీసోళ్లు ఫొటో తీసుకుంటే సబితమ్మ చెప్పినట్టు ఈ సారి వస్తే మీ చేతులో ఉన్న సెల్‌ఫోన్‌తో ఆ పోలీసోడి ఫొటో కొట్టండి. అన్నా గుర్తు పెట్టుకుంటం మా కేసీఆర్ సార్ వస్తుండు మీ ఫొటో చూపెడ్తమని చెప్పండి. అని కేటీఆర్ హితవు పలికారు.
Also Read: ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు ఇవాళ పెద్దసంఖ్యలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు తరలివచ్చి కేటీఆర్ ను కలిశారు. వివిధ పార్టీలకు చెందిన ముదిరాజ్ నేతలంతా ఐక్యంగా కలిసి వచ్చి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలన్న డిమాండ్ తో ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ పెద్దఎత్తున విజయవంతమైన సందర్భంగా కేటీఆర్ ని ప్రత్యేకంగా అభినందించారు.
ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభను నిర్వహించేందుకు సహకరించిన కేటీఆర్ కు ముదిరాజ్ నేతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ నేతలు కేటీఆర్ కు పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఈ నెల 30న సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజులకిచ్చిన హామీని మూడేళ్లు కావస్తున్నా ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తన సిరిసిల్ల పర్యటనలో ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కు మార్చే హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే ముదిరాజ్ లు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ముదిరాజ్ ల న్యాయమైన డిమాండ్ అమలయ్యే వరకూ బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ముదిరాజ్ ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని కేటీఆర్ హామీ ఇవ్వడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు పెద్దఎత్తున హర్షం ప్రకటించారు.
Also read: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాంపల్లి రెవెన్యూ అధికారి!