Solar Mandal: స్వేచ్చ బ్యూరో: కొడంగల్‌ను దేశంలోనే తొలి సోలార్ మోడల్ మండలంగా తీర్చిదిద్దే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వెండర్లు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని టీజీ రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ పిలుపునిచ్చారు. కొడంగల్ కాడా కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ముషారఫ్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో మోడల్ సోలార్ విలేజ్‌లను మాత్రమే అభివృద్ధి చేస్తున్నప్పటికీ, ఒక సంపూర్ణ మండలాన్ని సోలార్ మోడల్ మండలంగా అభివృద్ధి చేసే కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా కొడంగల్‌లో అమలవుతుండటం విశేషమని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతమైతే కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కొడంగల్ మండలంలో గృహజ్యోతి పథకం పరిధిలోని 5,186 విద్యుత్ సర్వీసులకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో 2,418 సర్వీసులు సాంకేతికంగా అనుకూలంగా గుర్తించగా, ఇప్పటికే సుమారు 2,000 రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన పనులను కూడా రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను క్లారో ఎనర్జీ లిమిటెడ్, హిందుస్తాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు చేపడుతున్నాయని తెలిపారు. సోలార్ మోడల్ మండలం లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో సాధించేందుకు గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
Also read: Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!
ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, అర్హులైన లబ్ధిదారులను ప్రోత్సహించడం, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించడం ద్వారా కార్యక్రమాన్ని వేగవంతం చేయవచ్చని ముషార్ఫ్ ఫరూఖీ సూచించారు. సమీక్ష సమావేశంలో పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా అందుబాటులో లేదని ప్రస్తావించగా, వెంటనే స్పందించిన ముషారఫ్ టీజీ రెడ్కో అధికారులు, సంబంధిత వెండర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను కాడా అధికారుల ద్వారా ఆయా సర్పంచులకు అందజేయడంతో పాటు, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులతో పంచుకోవాలని సూచించారు. వెండర్లు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యంగా మౌంటింగ్ స్ట్రక్చర్లకు సరైన గ్రౌటింగ్, సమర్థవంతమైన ఎర్తింగ్, లైట్నింగ్ ప్రొటెక్షన్, నీడలేని ప్రదేశాల్లో సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటు వంటి అంశాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. టీజీఎస్పీడీసీఎల్ అధికారులు నెట్ మీటర్ల ఏర్పాటు, గ్రిడ్ సింక్రొనైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేసి, లబ్ధిదారులు త్వరితగతిన సోలార్ విద్యుత్ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ముషారఫ్ ఫరూఖీ, కలెక్టర్, ఇతర అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసి, కొడంగల్‌ను దేశంలోనే తొలి సోలార్ మోడల్ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్, టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నరసింహులు, టీజీ రెడ్కో జనరల్ మేనేజర్ ప్రసాద్, రెవెన్యూ, పంచాయతీరాజ్, డిస్కం, టీజీ రెడ్కో అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వెండర్లు పాల్గొన్నారు.
Also read: Free Feeder: బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!