MLA Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఆయన గురించి పార్టీ పెద్దలు ఏమంటున్నారు? మంత్రి పదవికి ఇంకా సమయం ఉందని భావిస్తోందా? మరో ఏడాది తర్వాత ఆయన కోరిక నెరవేరుతోందా? ఆయన వ్యవహారశైలిని పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఆయన ఒక్కోసారి ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తుతున్నారు. అఫ్‌కోర్స్.. కారణాలు అనేకం. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీ 20 నెలలుగా పూర్తి చేయలేదనే ఆవేదన ఆయనలో బలంగా ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ గురించి ఆయనకు అంతా తెలుసు. జాతీయ పార్టీలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు ఆదేశాలు లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. రాజగోపాల్ విషయంలో అదే జరుగుతోంది. మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో ఆయన చేస్తున్న వరుస ట్వీట్లపై అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
20 నెలలుగా ఓపికతో చూశానని, అది నశించిపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రేవంత్ మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు మంత్రిగా ఉన్నారు. ఏడాది తర్వాత జరిగిన మంత్రి విస్తరణలో స్థానం దక్కుతుందని ఎంతో ఆశగా ఎదుుచూశారు. కానీ ఆ జిల్లాలో కుల సమీకరణాలు సెట్ కాలేదన్నది కొందరు కాంగ్రెస్ పెద్దలు అభిప్రాయం.
ALSO READ: మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణకు నీటి పారుదల శాఖ కీలక నిర్ణయం
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కేబినెట్‌లో ఉన్నారు. అదే జిల్లా నుంచి రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవి ఎలా ఇస్తారన్నది పార్టీలో కొందరు నేతల ప్రశ్న. పార్టీలో చేరినప్పుడు తాము బ్రదర్స్‌మని తెలీదా? 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇవ్వలేదా అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.
11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు మూడు పదవులు ఇస్తే తప్పేంటన్నది ఆయన ప్రశ్న. కాకపోతే ఖమ్మంలో ముగ్గురు మంత్రులు వేర్వేరు సామాజిక వర్గానికి చెందినవారు. కానీ నల్గొండ జిల్లా పరిస్థితి వేరని గుర్తు చేస్తున్నారు. మంత్రి పదవి దక్కలేదన్న కారణంతో అప్పుడప్పుడు తన ఆగ్రహాన్ని బయటపెడుతున్నారు.
సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి అనుకూలంగా మాట్లాడుతున్నారు. సోదరుడి మంత్రి పదవి హామీ విషయం తనకు తెలీదని తప్పించుకుంటున్నారు. భయపెట్టడానికి రాజగోపాల్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఏదైనా వ్యూహముందా? అనే చర్చ లేకపోలేదు.
తనకు అన్యాయం జరిగినా పర్వాలేదని కానీ, మునుగోడు ప్రజలకు అన్యాయం చేయకుండా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. రాజగోపాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దలు కానీ, క్రమశిక్షణ కమిటీ గానీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెడతారా? ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తారా? లేకుంటే రాజీనామాకు సిద్ధమవుతారా? నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి.