Medigadda: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంగిన ఏడో బ్లాక్‌ను పునరుద్ధరించేందుకు.. అవసరమైన చర్యలను ప్రారంభించింది. దీనికి కావల్సిన మరమ్మతులు చేయడానికి డిజైన్ల రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌కు అప్పగించారు. అయితే ఈ సంస్థ రామగుండం సీఈ నుంచి సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదికను పంపించింది. దీంతో ఈఎన్సీ అంజద్ హూస్సేన్ తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని పనుల గురించి లేఖలో తెలిపినట్లు సమాచారం ఇచ్చారు.
మేడిగడ్డ పునరుద్ధరణకు డిజైనర్
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్.. 2023 అక్టోబరులో కుంగింది. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు బయటపడ్డాయి. పునరుద్ధరణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏ సహాయం కోరగా పలు సూచనలు చేసింది. దాని ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు, అనుభవమున్న డిజైనర్ సహకారం కావాలని సీడీవో నిర్ణయానికి వచ్చింది. డిజైన్ల వరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే బాగుంటుందని సూచించడంతో… ఈఎన్సీ అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు.
డిజైన్ల సంస్థ ఎంపికకు జాతీయ స్థాయిలో టెండర్లు
బ్యారేజీల పునరుద్ధరణకు.. డిజైనర్ల ఎంపిక చేసేందుకు జాతీయ స్థాయిలో టెండర్లు పిలవాలని అధికార వర్గాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా సీడీవోనే పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ప్రణాళిక పూర్తయిన తర్వాత నివేదిక అందించడానికి 3 నెలల గడువును విధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిజైన్లు అందిన తర్వాత ప్రస్తుత నిర్మాణ సంస్థలతోనే బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేయించాలన్నారు.. అదనపు పనులు అవసరమైతే వాటికి చెల్లింపులు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. ఒక వేళ ఆ సంస్థలు అంగీకరించకపోతే తుది బిల్లులు, డిపాజిట్లను మినహాయించి అనుభవం ఉన్న సంస్థలతో పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
Also Read: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?
సీడీవోకే పర్యవేక్షణ బాధ్యత.. ప్రభుత్వానికి ఈఎన్సీ లేఖ
మేడిగడ్డతోపాటు రెండు బ్యారేజీల్లోని లోపాలను సీడీవో మొదట అధ్యయనం చేసింది. ఎన్డీఎస్‌ఏ నివేదికలు, పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఇచ్చిన రిపోర్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు గైడ్‌బండ్ 2023 జూన్‌లో కుంగిన అనంతరం చేపట్టిన పునరుద్ధరణ చర్యలు, అనుసరించిన డిజైన్లు తదితర అంశాలను ఆ రాష్ట్ర జల వనరుల శాఖ నుంచి తెప్పించుకుని అధ్యయనం చేసినట్లు సమాచారం ఇచ్చారు.