Konda Murali : మొన్న తిట్టాడు. ఇవాళ కంప్లైంట్ చేశాడు. అట్లుంటది మరి కొండా మురళితోని. అందుకే ఆయన్ని మాస్ లీడర్, రెబల్ లీడర్ అంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. ఇటీవల కొండా మురళి బాధిత ఎమ్మెల్యేలంతా కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేడమ్ మీనాక్షికి గోడు వెళ్లబోసుకున్నారు. క్రమశిక్షణా కమిటీకి మేటర్ చేరింది. వాళ్ల ఎపిసోడ్ అలా ముగిసింది. ఇక కొండా మురళి టర్న్ మొదలైంది. మందీమార్బలంతో, 60 వాహనాల భారీ కాన్వాయ్‌తో వరంగల్ నుంచి గాంధీభవన్ వరకు బలప్రదర్శన చేశారు. క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్, సభ్యులను కలిశారు. ఆయనే తిట్టి.. తిరిగి ఆయనే రివర్స్ కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
వాళ్లందరిపై కంప్లైంట్
నలుగురు మినహా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరిపై ఫిర్యాదు చేశారు కొండా మురళి. తనను ఎవరూ పిలవలేదని.. PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై ఉన్న అభిమానంతో పార్టీకి వివరణ ఇస్తున్నానంటూ పెద్ద వివాదమే రాజేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పైన కొండా మురళి కంప్లైంట్ చేశారు. ములుగు ఎమ్మెల్యే అయిన మంత్రి సీతక్కతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అక్కడితో ఆగలేదు కొండా. ఏకంగా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పైనా ఆరోపణలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. ఇక, పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్వినీరెడ్డి, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
ఆ నాలుగు నావే.. తగ్గేదేలే..
జిల్లాలోని ఒక్కో ఎమ్మెల్యే గురించి సెపరేట్‌గా రిపోర్ట్ రెడీ చేసి క్రమశిక్షణా కమిటీకి అందజేశారు కొండా మురళి. పొంగులేటి, సారయ్య, నాయిని, కడియం, రేవూరి, వేం నరేందర్‌రెడ్డిలతో తనకున్న విభేదాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరకాల, భూపాల్‌పల్లి, వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్.. ఈ నాలుగు నియోజకవర్గాలు తనవే అంటూ, తన పెత్తనం ఇలానే ఉంటుందంటూ నివేదికలో తేల్చి చెప్పడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్.. కేసీఆర్‌కు చిక్కులే..
భయపడేదేలే..
లోపల భేటీ ముగిశాక బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కొండా మురళి. బహిరంగ విమర్శలు చేయడం మంచో చెడో తన అంతరాత్మకు తెలుసన్నారు. తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజీనామా చేసి తాను కాంగ్రెస్‌లోకి వచ్చానని.. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో తేల్చుకోవాలన్నారు. దేనికి బయపడనని.. సీఎం, పీసీసీ అంటే గౌరవం ఉందని చెప్పారు కొండా.