Formula E Car Case: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. ఆయన వెంట భారీ ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో మరోసారి ఏసీబీ ముందుకు రానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తొలుత అధికారులను విచారించిన ఏసీబీ, ఆ తర్వాత కేటీఆర్ వంతైంది. ఇదే క్రమంలో ఫార్ములా ఈ-రేస్ ఆపరేషన్స్ సంస్థ నుంచి పలుమార్లు సమాచారం సేకరించింది ఏసీబీ. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ కేటీఆర్‌ను అధికారులు విచారించనున్నారు.
ఇవాళ్టి విచారణతో ఈ కేసుకు ముగింపు చెప్పాలన్నది అధికారుల ఆలోచన. దీని తర్వాత న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి ఫైనల్ ఛార్జిషీటు వేయనుంది. మే 28న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఆ సమయంలో తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో జూన్ 16న తమ ఎదుట హజరవ్వాలని ఇటీవల నోటీసులు ఇచ్చింది ఏసీబీ.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కేటీఆర్, విచారణకు హాజరుకావాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ. హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేస్ నిర్వహించే సంస్థ ఎఫ్ఈఓకు రూ.50 కోట్లకుపైగా నిధులు మళ్లించడంపై ఏసీబీ దృష్టి పెట్టింది.
ALSO READ: శంషాబాద్‌లో హై టెన్షన్.. తిరుపతి విమానంలో పొగలు
ఈ కేసులో ఐఏఎస్‌లు అరవింద్ కుమార్, దాన కిషోర్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. ఇండియా నుంచి విదేశాలకు నిధులు వెళ్లడంపై ఈడీ కూడా రంగంలోకి దిగేసింది. ఏసీబీ సేకరించిన వివరాలు తీసుకుని విచారణ జరిపింది.
ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్ధ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలుమార్లు విచారించింది ఏసీబీ. విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు విషయం, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడం, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన వంటి అంశాలపై అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
కేటీఆర్ విచారణ పూర్తి కాగానే ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారట ఏసీబీ అధికారులు. కేటీఆర్‌ను విచారణకు పిలవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశముందని చర్చించుకున్నారు.
ఈ క్రమంలో వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు పార్టీ ఆఫీసుకు రానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి ఏసీబీ కార్యాలయానికి గులాబీ శ్రేణులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశాలు కన్పిస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు.