Suryapet Railway Dream: రైలు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న సూర్యాపేట ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. డోర్నకల్–గద్వాల్ మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గం సూర్యాపేట మీదుగా వెళ్లనుండటంతో జిల్లా కేంద్రం రైల్వే మ్యాప్‌లోకి వచ్చే అవకాశం ఏర్పడింది. దాదాపు 296 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రక్రియ ముందుకు సాగుతోంది.
డోర్నకల్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే లైన్ ఖమ్మం రూరల్ ప్రాంతం, కూసుమంచి, పాలేరు, మోతె మీదుగా సూర్యాపేటకు చేరుకునేలా ప్రతిపాదించారు. అక్కడి నుంచి నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాల మీదుగా గద్వాల్ వరకు వెళ్లనుంది. ఈ కొత్త మార్గం దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైల్వే సౌకర్యం పరిమితంగా ఉన్న ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే ఉద్దేశంతో రూపొందుతోంది. అలాగే ఇప్పటికే ఉన్న ప్రధాన రైల్వే మార్గాలకు అనుసంధానమయ్యే అవకాశం ఉండటంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణాకు కూడా ఉపయోగపడనుంది.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే స్టేషన్ రావాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. జిల్లాలో మేళ్లచెర్వు, మఠంపల్లి లాంటి ప్రాంతాల్లో రైల్వే సౌకర్యం ఉన్నప్పటికీ, అవి ప్రధానంగా పరిశ్రమల సరుకు రవాణాకు ఉపయోగపడుతున్నాయి. కొత్త మార్గం అమల్లోకి వస్తే సూర్యాపేట పట్టణానికి ప్రయాణికుల రైళ్లతో నేరుగా లింక్ ఏర్పడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్, విజయవాడతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు కూడా రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే కొత్త రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి తుది అనుమతులు రావాలంటే DPR అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ తదితర సంస్థలతో సంప్రదింపులు, అవసరమైన అనుమతులు కంప్లీట్ కావాల్సి ఉంది. సో, నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని రైల్వే శాఖ వెల్లడించింది.
ఈ రైల్వే లైన్ కేవలం ప్రయాణికులకే కాకుండా పారిశ్రామిక రంగానికి కూడా ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి సహా పలు ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ, పారిశ్రామిక సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి రైల్వే మార్గం అందుబాటులోకి వస్తుంది. కోల్, సిమెంట్ లాంటి ఉత్పత్తుల రవాణా సులభమైతే పరిశ్రమలకు రవాణా భారం తగ్గే అవకాశం ఉంటుంది. దక్షిణ తెలంగాణలోని రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఈ మార్గం ఒక కొత్త రవాణా దారిగా నిలవొచ్చని అధికారులు వెల్లడించారు.
డోర్నకల్–గద్వాల్ రైల్వే లైన్ పూర్తయితే సూర్యాపేటతో పాటు నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెరగనుంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్న ఆశ ప్రజల్లో కనిపిస్తోంది.
Read Also: పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!