HMDA TDR: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండిఏ) పరిధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు, భూసేకరణ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. స్థల సేకరణకు నష్టపరిహారాన్ని నగదు రూపంలో చెల్లించటానికి ప్రత్యామ్నాయంగా యజమానులకు జారీ చేసే ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్) లు జారీ, వినియోగం మార్గదర్శకాల్లో భారీ మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. క్యూర్ సిటీ పరిధితో పాటు ప్యూర్ సిటీ పరిధిలోనూ ఇకపై హెచ్ఎండీఏ చేపట్టనున్న అన్ని రకాల ప్రాజెక్టులకు అవసరమైన స్థల సేకరణను నేరుగా హెచ్ఎండీఏ చేసుకునేలా, యజమానులకు టీడీఆర్ లు జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ జీవో నెంబర్ 218 ను జారీ చేసింది.
తెలంగాణ బిల్డింగ్ రూల్స్ -2012 లో ఇందుకు అవసరమైన సవరణలను కూడా తీసుకురానున్నట్లు సర్కారు ఆదేశాల్లో స్పష్టం చేసింది. టీడీఆర్ బదిలీ, వినియోగానికి సంబంధించి గతంలో 2019, 2022లో సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. టీడీఆర్ లకు సంబంధించ ఈ నూతన నిబంధనలు తెలంగాణ గెజిట్ లో ప్రచురితమైన తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని, ఎంఏయూడీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పేరిట ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రస్తుతం హెచ్ఎండీఏ హైదరాబాద్ నగరంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి తూం కుంట ఔటర్ ఎగ్జిట్ వరకు సుమారు 18.18 కిలోమీటర్ల పొడువున నిర్మిస్తున్న అతి పొడైవైన రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు నిన్నమొన్నటి వరకు సికిందరాబాద్ మండలం పరిధిలోని ఆస్తుల నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూ సేకరణ ప్రక్రియ జరిగింది. కొందరు స్థల యజమానులకు హైదరాబాద్ జిల్లా పూర్వ కలెక్టర్ హరిచందన, ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ ప్రయాంక ఆలా కూడా పరిహారం చెక్కులను అందజేశారు. కానీ శుక్రవారం సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 218 ప్రకారం ఇకపై హైదరాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని క్యూర్ తో పాటు ప్యూర్ సిటీ, హెచ్ఎండీఏ పరిధిలో హెచ్ఎండీఏనే నేరుగా స్థల సేకరణ చేసుకునేలా, స్థల యజమానులకు నష్టపరిహారం చెల్లింపులు జరిపేలా, లేక పరిహారం స్థానంలో ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్ ను జారీ చేసే పవర్ ను సర్కారు తాజా ఆదేశాల్లో హెచ్ఎండీఏకు కట్టబెట్టింది.
Also Read: నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు.. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే, అందంగా ఉందని కోస్తే జైలుకే
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (సీయూఆర్ఈ), ప్యూర్ రీజియన్ ఎకానమీ (పీయూఆర్ఈ) పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు కూడా ఇదే నిబంధన వర్తించనున్నట్లు సర్కారు ఆదేశాల్లో స్పష్ట చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేసినా వాటికి స్థల సేకరణ ప్రక్రియ ఇకపై జిల్లా కలెక్టర్లు కాకుండా హెచ్ఎండీఏనే చేయనున్నట్లు ఈ తాజాగా ఆదేశాలు స్పష్టం చేస్తున్నారు. సికిందరాబాద్ ప్యారడైజ్ నుంచి తూం కుంట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వరకు నిర్మిస్తున్న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్ ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్నందున, కంటోన్మెంట్ లోని కేంద్ర రక్షణ శాఖకు చెందిన స్థలాల సేకరణ బాధ్యతను కూడా తాజా ఆదేశాలతో సర్కారు హెచ్ఎండీఏకు కేటాయించింది. దీంతో ఇకపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, మెట్రోరైలు, ప్రభుత్వ భవనాలు వంటి ప్రాజెక్టుల కోసం యజమానులు స్వచ్ఛందంగా అప్పగించినా లేదా హెచ్ఎండీఏ స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా స్వాధీనం చేసుకున్న భూములకు సైతం హెచ్ఎండీఏనే టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది.
హెచ్ఎండీఏ జారీ చేసే టీడీఆర్ లపై పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా టీడీఆర్ సర్టిఫికెట్ల దరఖాస్తు, పరిశీలన, ఆమోదం, జారీ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్ లైన్ లోనే నిర్వహించాలని సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి ప్రస్తుతం వినియోగిస్తున్న బిల్డ్ నౌ వ్యవస్థలో టీడీఆర్ ప్రాసెసింగ్, జారీ, అకౌంటింగ్, వినియోగానికి సంబంధించిన సాంకేతిక మార్పులు చేపట్టాలని సర్కారు ఆదేశించింది. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గడంతోపాటు, ఫైల్ ప్రాసెసింగ్ లో జాప్యానికి, అవినీతికి, మధ్య వర్తుల జోక్యానికి చెక్ పడనుంది.
అలాగే టీడీఆర్ కు సంబంధించిన వివరాలు, లెక్కలు, వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామ్ సిస్టమ్ ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. హెచ్ఎండీఏ జారీ చేసే ప్రతి టీడీఆర్ సర్టిఫికెట్, సంబంధిత ఉత్తర్వుల కాపీలు, సమాచారం, రికార్డు నిమిత్తం సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ), ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్ సీడీఏ) కు తప్పనిసరిగా సమర్పించాలన శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో సర్కారు పేర్కొంది.
Also Read: ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!