ప్రతీదీ రద్దేనా..?
మీరు చేస్తేనే రైటా కేటీఆరూ!
అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్లు పార్ట్ 3
⦿ అదానీ అంశాన్ని తలకెత్తుకున్న కేటీఆర్
⦿ మొన్నేమో హైడ్రాపై తప్పుడు ప్రచారం
⦿ నిన్నేమో మూసీ, ఫార్మాపై రాద్ధాంతం
⦿ ఇప్పుడు అదానీ అంశంలో బద్నాం చేసే ప్రయత్నం
⦿ రాష్ట్రానికి పెట్టుబడులు మేమే తెచ్చామని పదేళ్లు గొప్పలు
⦿ ఇప్పుడేమో జరుగుతున్న అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు
⦿ కేసీఆర్ పాలనలో అదానీతో జరిగిన చీకటి ఒప్పందాల సంగతేంటి?
⦿ ఏరోస్పేస్ పార్క్, హార్డ్‌వేర్ పార్క్‌లో పెట్టుబడులపై మౌనమెందుకు?
⦿ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదానీ జెట్‌లో ఎక్కడకు వెళ్లారు?
⦿ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ ఎటాక్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: KTR Allegations on Congress: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతీ చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారింది. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కుట్రలకు తెర తీయడం మామూలైంది. హైడ్రా కూల్చివేతల సమయంలో పేదల ఇళ్లను కూల్చకపోయినా, కూల్చివేసినట్టు తెగ రాద్ధాంతం చేసింది. చెరువులు, నాలాలను కబ్జా చేసి వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లను కూల్చేస్తే తప్పుడు చేసి రాజకీయం చేసింది. మూసీ పునరుజ్జీవనం అంశంలోనూ అంతే.
ఎన్నో ఏళ్లుగా మురికి కూపంలో బతుకుతున్న వారికి విముక్తి కలిగించాలని ప్రభుత్వం సంకల్పిస్తే, నిర్వాసితుల దగ్గరకు పోయి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఈమధ్య ఫార్మా అంశంలోనూ అదే తీరు కనబర్చింది. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏం చేసినా రైటు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా గనుక ప్రభుత్వాన్ని కావాలని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అదానీ వ్యవహారంలోనూ గోల చేస్తోంది. ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులు లేవంటూ ప్రచారం చేస్తూనే చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలంటూ కేటీఆర్ కొత్త పాట అందుకున్నారు.
అదానీ వ్యవహారం ఏంటి.. కేటీఆర్ వాదనేంటి?
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వ్యాపార సామ్రాజ్యాల్లో అదానీ గ్రూప్ ఒకటి. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సిమెంట్, విద్యుత్ ఇలా అనేక రంగాల్లో విస్తరించింది. ఇతర దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రపంచమంతా విస్తరిస్తున్నారు ఆ సంస్థ అధినేత గౌతమ్ అదానీ. అయితే, అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించి ఇండియాలోని పలు రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చారని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో లంచాలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తారు.
అయితే, ఇవన్నీ నిరాధారమని అదానీ గ్రూప్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ ఏదైతే లంచాలు ఇచ్చిందని చెబుతున్న రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధమే లేదు. ఇతర రాష్ట్రాల్లో సంబంధించిన వ్యవహారం ఇది. కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తెలంగాణకు లింక్ పెట్టి, ఇక్కడ జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. కేసీఆర్ హాయాంలో ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. కానీ, ఇదంతా అవాస్తవమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో అదానీతో వ్యవహారాలు
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు పెట్టింది వాస్తవమే. అలాగే, కొన్ని చీకటి వ్యవహారాలూ నడిచాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆ విషయాలను గుర్తు చేస్తూ కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకనాడు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కేసీఆర్‌తో అదానీ భేటీ అయ్యారు. ఆనాడు రాష్ట్రానికి పెట్టుబడుల వరద అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. అలాగే, దావోస్‌లోని ఆర్థిక సదస్సులో అదానీతో కేటీఆర్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలు బలంగా వినిపించాయి.
అంతేనా, అదానీ గ్రూప్‌కు లబ్ధి చేకూరేలా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేశారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదానీ ప్రైవేట్ జెట్‌లో చక్కర్లు కొట్టారని, దీని వెనుక ఎలాంటి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని అడుగుతున్నారు. హైదరాబాద్‌లో అదానీ ఏరోస్పేస్ పార్క్, తెలంగాణ హార్డ్‌వేర్ పార్క్‌లో పెట్టుబడుల సంగతేంటని కేటీఆర్‌ను నిలదీస్తున్నారు. మీరు చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారమా, కావాలని అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
అధికారిక ఒప్పందాలతో ఇబ్బందేంటి?
ఏడాది సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి అంటూ అడుగులు వేస్తోంది. ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాలు చేపడుతూనే, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సెక్టార్‌లో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అనేక కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అలా, స్కిల్ యూనివర్సిటీకి అదానీ సంస్థ వంద కోట్ల రూపాయల విరాళం అందించింది. అయినా, మీరు చేసుకునే చీకటి ఒప్పందాల్లా కాకుండా అఫీషియల్‌గా రేవంత్ ప్రభుత్వం అదానీతో ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ‘‘ఇక్కడ ఒప్పందం కుదుర్చుకొని, విదేశాలకు వెళ్ళినపుడు నీ సొంత కంపెనీలకు మరల్చినట్టు కాదు.
నీలా కుటుంబం కాదు. రాష్ర్ట మేలు మా లక్ష్యం. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం తెలంగాణ స్కిల్ వర్శిటీ. సీఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద తెలంగాణ స్కిల్ వర్శిటీకి అదానీ నిధులు ఇస్తానంటే, సరైన మార్గంలో పారదర్శకతతో జరిగితే ఇంత రాద్ధాంతం అవసరమా? మేము చేసుకున్న ప్రతి ఒప్పందం ప్రజాక్షేత్రంలో ఉంది. మరి మీరు చేసుకున్న చీకటి ఒప్పందాలను ప్రజాక్షేత్రంలో పెట్టే దమ్ముందా కేటీఆర్?’’ అంటూ హస్తం నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.