KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి బీసీలను మరిచిపోయారా..? అని నిలదీశారు. ఎవరికి మద్దతు ఇచ్చేది పార్టీలో చర్చించి సెప్టెంబర్ 9 నాటికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు ఏ పార్టీ వాళ్లూ తమను సంప్రదించలేదని అన్నారు. కంచె ఐలయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాల్సిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ అని.. అలాంటి పార్టీ పెట్టిన అభ్యర్థిని తాము ఎలా సమర్ధిస్తామని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో అంతా డ్రామా జరుగుతోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు..
ఇక.. రాష్ట్రంలో ఎరువుల బస్తాల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడమే తెలుసు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పాత కష్టాలను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ హయాంలో ఎరువులు బఫర్ స్టాక్ పెట్టే వాళ్లం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదు’ అని కేటీఆర్ తెలిపారు.
రైతులకు 2 లక్షల టన్నుల యూరియా అవసరం..
‘తెలంగాణ రైతులకు 2 లక్షల టన్నుల యూరియా అవసరం. సెప్టెంబర్ 9 నాటికి 2 లక్షల టన్నుల యూరియా ఇస్తామని.. ప్రధాని మోదీ లేదా రాహుల్ ప్రకటించాలి. సెప్టెంబర్ 9 నాటికి యూరియా స్టాక్ తెచ్చిపెట్టిన పార్టీకి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తాం. తెలంగాణను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే.. రాష్ట్ర ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాయకుడే లేరని’ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Airport Authority of India: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. తక్కువ కాంపిటేషన్..
సీఎం ఢిల్లీకి 51 సార్లు వెళ్లినా..?
రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ఇతర శాఖలతో సమన్వయం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఓ రైతు 3 బస్తాల యూరియా తీసుకుంటే నాన్‌బెయిలబుల్ కేసు పెట్టారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మార్కెట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే యూరియా అమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 51 సార్లు వెళ్లిన కనీసం ఒక్క బస్తా యూరియా తీసుకురాలేకపోయారని తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు రైతులను మోసం చేస్తున్నాయి…
ఎరువుల కొరతపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఏపీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రామగుండం యూనిట్‌ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.