Lady Aghori: లేడీ అఘోరీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఇటీవల ఏదొక వివాదాలను సృష్టిస్తున్న అఘోరీకి ఇక తిప్పలు తప్పవనే అంటున్నారు భక్తులు. పోలీసులు కూడ అఘోరీపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. అఘోరీ ఏ ఆలయానికి వెళ్లినా, వివాదాల్లో ఉండడం సాధారణంగా మారిందని, ఇటువంటి వాటిని ఉపేక్షించకుండా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని భక్తులు కోరుతున్నారు. తాజాగా కొమురవెల్లి ఆలయం వద్ద జరిగిన ఘటనలో పలువురు భక్తులకు గాయాలైన విషయం తెలిసిందే.
సిద్ధిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంకు అఘోరీ మంగళవారం వచ్చిన విషయం తెలిసిందే. స్వామివారి దర్శనానికి వచ్చి ఏకంగా ప్రధాన ద్వారం గుండ దర్శనం కావాలని అఘోరీ పట్టుబట్టడంతో, వస్త్రధారణ పాటించాలని అధికారులు సూచించారు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేయడం, అక్కడే తన వద్ద గల కత్తితో పలువురిని దాడి చేసింది. అంతేకాదు కవరేజ్ కు వచ్చిన మీడియా ప్రతినిధి ఫోన్ ను కూడ చేతబట్టి ధ్వంసం చేసింది. గతంలో కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పెట్రోల్ క్యాన్ తో ఆత్మార్పణ చేసుకుంటానని వీరంగం చేసింది.
కొమురవెళ్లి ఆలయం వద్ద అఘోరీ ప్రవర్తించిన తీరుతో భక్తులు కూడ ఖంగుతిన్నారు. స్వామి వారి దర్శనానికి వస్తే, దర్శనం పూర్తి చేసుకొని వెళ్లాలి కానీ, ఎక్కడికి వెళ్లినా ప్రచారం కోసం అందరిపై దాడి చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కాగా నిన్నటి ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట సీపీ ఆదేశాలతో లేడీ అఘోరీపై 18(1),324(5),292,351(3)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని భక్తులు కోరుతున్నారు. అలాగే ఎక్కడ చూసినా ఏదో ఒక వివాదంలో ఉండే అఘోరీపై ఇప్పటికే వరంగల్ జిల్లాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. గతంలో శ్మశాన వాటికలో కోడిని బలిచ్చి తాంత్రిక పూజలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరీపై ఆదిలోనే పోలీసులు చర్యలు తీసుకొని ఉన్నట్లయితే, నేడు కత్తులతో దాడికి పాల్పడే స్థితిగతులు రావని, ప్రభుత్వం కూడ వెంటనే జోక్యం చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న లేడీ అఘోరీని కట్టడి చేయాలని భక్తులు కోరుతున్నారు.
Also Read: CM Revanth Reddy: సమగ్ర ఇంటింటి సర్వేతో.. దేశవ్యాప్త చర్చ.. సీఎం రేవంత్ రెడ్డి
ఇది ఇలా ఉంటే ఎందరో సత్పురుషులు, నాగ సాధువులు కుంభమేళాలో ఉంటే, ఈ లేడీ అఘోరీ మాత్రం ఇక్కడిక్కడే సంచరించడంపై కూడ భక్తుల్లో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. అసలు నాగ సాధువులు, అఘోరాలు జనంలోకి రారని, రోజూ ఏదోక వివాదంలో ఉంటున్న లేడీ అఘోరీ అసలు సంగతి బయటకు వెల్లడయ్యేలా పోలీసుల విచారణ సాగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా కేసు నమోదు కావడంతో అఘోరీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.