అఘోరీ ఓవరాక్షన్ ఏ స్థాయికి వెళ్లిందో.. రెండు తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆలయాలకు వెళ్లడం, ఎవ్వరినీ లెక్కచేయకుండా వీఐపీలా దర్శనాలు చేసుకోవడం, ప్రశ్నిస్తే.. బూతులు తిట్టడం, ఆపితే.. కర్రలు తీసుకొని కొట్టడం లాంటివన్నీ చేసింది. కొన్నికొన్ని సార్లు పెట్రోల్ క్యాన్ తీసుకొని.. ఆత్మార్పణం చేసుకుంటానంటూ బెదిరించింది. చివరికి.. పోలీసులను కూడా లెక్కచేయకుండా ప్రవర్తించింది. వాళ్లను బూతులు తిట్టడమే కాదు.. వారిపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించింది. అబ్బో.. అఘోరీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆమె చర్యలు, ఆర్థిక లావాదేవీలు, జనంలో అతి ప్రవర్తన లాంటివన్నీ ఆమె పతనానికి దారితీశాయి.
ఇదంతా ఒక ఎత్తైతే.. అఘోరీ శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం మరో ఎత్తు. శ్రీ వర్షిణి అనే అమ్మాయితో అతను నడిపిన ప్రేమ వ్యవహారం, ఆమెను పెళ్లి చేసుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం.. కుటుంబ తగాదాలు.. ఇలా చాలానే నడిచింది. ఇంతలోనే.. అఘోరీకి ముందే పెళ్లైపోయిందనే విషయం బయటపడింది. అతని మొదటి భార్య రాధిక.. తనను మోసం చేసి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. అఘోరీ జనంలో మరింత పలుచనైపోయాడు. ఇదిలా ఉంటే.. నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి.. బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు.
మొదట్నుంచీ.. అఘోరీ వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. సనాతన ధర్మం, ఆధ్యాత్మిక, భక్తి మార్గం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. ఆలయాలను సందర్శిస్తూ.. కాంట్రవర్శీలకు కేరాఫ్‌గా మారింది. ఇక.. బీటెక్ చదివిన శ్రీవర్షిణి అఘోరీతో వెళ్లడం, అతన్నే పెళ్లి చేసుకోవడం కూడా జనంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అఘోరీ.. సడన్ గా ప్రేమ, పెళ్లి వైపు మళ్లింది. ఈ పరిణామం ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో.. అతని ఆధ్యాత్మికత, భక్తిపై అందరిలోనూ అనుమానం మొదలైంది. తన పబ్బం గడుపుకునేందుకే.. ఈ వేషం వేశాడనే చర్చ జరిగింది. అఘోరీ ఆధ్యాత్మిక మార్గానికి కట్టుబడి ఉండకుండా.. పక్కదారి పట్టడంతోనే అతని పతనమైపోయాడు.
Also Read: బోనాలతో సంబురాలు మొదలు.. పూర్తి షెడ్యుల్ ఇదే..
అతని ప్రవర్తన, వ్యక్తిగత సంబంధాలు, ఒకరిని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం, బెదిరింపులకు పాల్పడటం లాంటివన్నీ.. అఘోరీని ఎటూ కాకుండా చేశాయి. ముఖ్యంగా.. తనని తాను ఓ ఆధ్యాత్మిక వ్యక్తిగా చిత్రీకరించుకొని.. పూజలు, ధర్మం పేరుతో డబ్బలు వసూలు చేయడం, జనాన్ని మోసం చేయడం లాంటివి కూడా అతని ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఏ సోషల్ మీడియాతో అతను.. జనాన్ని ఆకర్షించి పాపులర్ అయ్యాడో.. చివరికి అదే సోషల్ మీడియా అఘోరీ వివాదాలను, మోసాలను, అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఆఖరికి తీసుకెళ్లి.. జైల్లో కూర్చోబెట్టింది. ధర్మం పేరు చెప్పి దారితప్పినవారెవరైనా సరే.. చివరికి ఇలా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందనే సందేశం ఇచ్చింది అఘోరీ ఎపిసోడ్.