Mahakumbh Bus Fire | ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ క్షేత్రంలో తెలంగాణ (Telangana) యాత్రికులు పెనుప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు. అదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన 50 మంది యాత్రికులు తీర్థయాత్ర నిమిత్తం వెళ్లగా, అకస్మాత్తుగా వారి ప్రయాణ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా, మిగతా 49 మంది సురక్షితంగా బయటపడ్డారు. బృందావన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టి, వారికి తగిన సాయం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్ (Nizamabad) జిల్లా కుభీర్ మండలం పల్సీ గ్రామానికి చెందినవారని గుర్తించారు.
ఈ విషాద వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తక్షణమే స్పందించారు. బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో చర్చించారు. యూపీకి చెందిన బృందావన్ అధికారులు సానుకూలంగా స్పందించి వాహనాల సదుపాయం కల్పించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు మొత్తం, యాత్రికుల సామాన్లు, నగదు, వస్త్రాలు అన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం యూపీ పోలీసులు, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో ఉన్న యాత్రికులకు తినుబండారాలు, నీరు వంటి అవసరాలను తీర్చారు. వారికి ఆర్థిక సాయం అందించి, తిరిగి స్వస్థలాలకు పంపేందుకు మరో బస్సును ఏర్పాటు చేశారు.
Also Read: వరంగల్ జిల్లాలో వరుసగా దొంగతనాలు.. కట్టర్లతో తాళాలు పగలకొట్టి దోపిడీ
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 1న ముదోల్ నుంచి మహా కుంభమేళాకు బయలుదేరిన బస్సు మంగళవారం సాయంత్రం మథురా హైవేపై ఆగి ఉండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. యాత్రికుల కథనం ప్రకారం, కుభీర్ మండలం పల్సీ గ్రామానికి చెందిన సిలెం దురుపతి (63) అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయారు. మిగతా యాత్రికులు సమీపంలోని తీర్థ స్థల దర్శనానికి వెళ్లగా, ఈ లోగా బస్సు మంటల్లో కాలి పోయింది.
ఒక యాత్రికుడి వివరాల ప్రకారం, దురుపతి బస్సులో ధూమపానం చేస్తుండగా, ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో బస్సుతో పాటు ఆ వ్యక్తి సజీవదహనం కాగా, బస్సులోని దుస్తులు, నగదు, ఇతర సామాగ్రి పూర్తిగా నాశనమయ్యాయి. యాత్రికులు ఈ ఘటనను చూసి షాక్‌కి గురయ్యారు. బృందావన్ అధికారులు యాత్రికుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేసి, వారిని క్షేమంగా స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.