జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకే కొంతమంది ఆత్మహత్య వరకూ వెళుతుంటారు. ఏ సమస్య అయినా కాస్త ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది. కానీ అలా ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటుంటారు. అయితే భూమిపై బ్రతకాలని రాసి పెట్టి ఉంటే ఏం జరిగినా చనిపోరని పెద్దలు చెబుతుంటారు.
అలా రాసి పెట్టి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా ఏదో ఒక రకంగా బతికి బయటపడతారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి భద్రాచలంలో చోటు చేసుకుంది. ఓ యువకుడు భ్రదాచలంలోని గోదావరి వంతెనపై నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న స్థానికులు ఆ వ్యక్తిని కిందికి దూకవద్దని సమస్య ఏంటో చెబితే తాము తీరుస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
అయినప్పటికీ ఆ వ్యక్తి వినకుండా దూకేస్తానని పట్టుపట్టి కూర్చున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు అతడిని మెల్లిగా మాటల్లో పెట్టారు. ఆ సమయంలో బ్రిడ్జిపై నుండి వాహనాలు అటూ ఇటూ వెళుతున్నాయి. వారు మాటల్లో పెట్టిన సమయంలోనే వెనకనుండి వచ్చిన ఓ వ్యక్తి బైక్ ను నెమ్మదిగా ఆపేశాడు. దూకే వ్యక్తి అతడిని గమనించకుండా నెమ్మదిగా వెనక నుండి వెళ్లాడు. సరిగ్గా దూకే సమయంలో నడుం దగ్గర గట్టిగా పట్టుకుని వెనక్కి లాగేశాడు. వెనక్కి లాగిన వెంటనే అందరూ వచ్చి అతడిని పట్టుకున్నారు.