10th Hindi Paper Leaked :
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఓ పరీక్షా కేంద్రంలో రేపు నిర్వహించాల్సి ఉన్న హిందీ ప్రశ్నాపత్రం ముందు గానే లీక్ అయ్యింది. అత్యంత పకడ్భందీగా నిర్వహించాల్సిన పరీక్షల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ రోజు ముందుగానే పేపర్ లీక్ కావడం.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం గుర్తించేందుకు సైతం ఉపాధ్యాయులకు చాలా సమయం పట్టడం.. ఆ తర్వాత తాపీగా దిద్దుబాటు చర్యలకు దిగడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈరోజు 21 మార్చి 2025న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పరీక్ష మొదలయ్యింది. సెకండ్ ల్యాంగ్వేజ్ హిందీ పరీక్ష రేపు (22.03.2025)న నిర్వహించాల్సి ఉంది. కానీ.. మంచిర్యాల జిల్లాలో మాత్రం ప్రశ్నా పత్రాలు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరించారు. ఏ పరీక్ష నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో విద్యార్థులకు రేపు నిర్వహించాల్సిన హిందీ ప్రశ్నా పత్రాలను పంపిణీ చేశారు. దీంతో.. ఒక రోజు ముందుగానే ప్రశ్నా పత్రం పూర్తిగా లీక్ అయ్యింది.
ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షల కోసం హడావిడిగా చదువుకుని వెళ్లిన విద్యార్థులకు ఉపాధ్యాయులు హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. ఈ రోజు తెలుగు పరీక్ష అని విద్యార్థులు చెప్పినా, ఉపాధ్యాయులు వినిపించుకోకుండా.. పరీక్షను నడిపించారు. తీరా.. 45 నిముషాల కానీ అసలు విషయం బోధపడలేదు. సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయిందని… తెలుగుకు బదులు హిందీ క్వశ్చన్ పేపర్ విద్యార్థుల చేతికి ఇచ్చినట్లుగా గుర్తించారు.
దాదాపుగా 45 నిమిషాల తర్వాత తేరుకున్న అధికారులు హిందీ ప్రశ్న పత్రాలను వెనక్కి తీసుకుని.. విద్యార్థులకు తిరిగి తెలుగు ప్రశ్న పత్రాలను ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. అయితే ప్రధానంగా రేపు జరగవలసిన హిందీ ప్రశ్న పత్రం దాదాపు 240 మంది విద్యార్థులు అటెండ్ అయిన కారణంగా రేపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ విద్యార్థుల ద్వారా ప్రశ్నాపత్రం మరింత మందికి చేరుకుంటుందని, అలా.. పేపర్ పూర్తిగా లీక్ అయినట్లే అని చెబుతున్నారు.
ఎక్కడ పొరబాటు జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాగా.. రోజు ఉదయాన్నే పోలీసు స్టేషన్ నుంచి ప్రశ్నా పత్రాలను తీసుకు రావాల్సి ఉంటుంది. SSB బోర్డు నుంచి జిల్లా కేంద్రాలకు ప్రశ్నా పత్రాలు వెళుతుంటాయి. అక్కడి నుంచి రక్షణ కోసం సమీపంలోని పోలీసు స్టేషన్ కు ప్రశ్నా పత్రాలు చేరుకుంటాయి. అక్కడి నుంచి ప్రతిరోజూ ఉదయాన్నే పరీక్షా కేంద్రాలకు పేపర్లు చేరుకుంటుంటాయి. అలా తీసుకువచ్చే సమయంలోనే పొరబాటు జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
హిందీ పేపర్ లీకేజ్ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారడంతో.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. జరిగిన పొరబాటుపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇందులో ఉపాధ్యాయులు, అధికారుల నిర్లక్ష్యం ఉంటే.. వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.