
Maoist Letter: మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు. జే.ఎం.డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని లేఖలో స్పష్టం చేశారు. బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యత లోపమేనని..పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా ప్రాజెక్టును నిర్మించారని మావోయిస్టులు లేఖలో తెలిపారు. ప్రజాధనం వృథా చేసిన కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యుడని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మావోయిస్ట్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. దుబ్బాక, దుంపలపల్లి రోడ్డులోని బ్రిడ్జిపై సిపిఐ మావోయిస్టు పేరుతో పోస్టర్ అతికించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కావస్తున్నా ఈ ప్రాంత రైతులు, నేతన్నలు, కార్మికులు విలవిలలాడుతున్నారని పోస్టర్‌లో రాశారు. బీఆర్ఎస్ నాయకులు చెలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంతా కలసి ఐకమత్యంతో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీని అడ్డు పెట్టుకొని భూకబ్జాలు, ఇసుక దందాలకు పాల్పడుతున్న నాయకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
.
.