Road Safety: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ (ZFD) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో చేపడుతున్న ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పర్యవేక్షణలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.జిల్లా పరిధిలో సుమారు 27 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉందని, ఈ మార్గంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు అవసరమని తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో వారం రోజుల్లో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరించడంతోపాటు నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ.. జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదాలకు దారితీస్తున్న సమస్యలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్, ఈడార్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారులపై వెలుతురు లేమిని ప్రధాన సమస్యగా గుర్తించామని, అవసరమైన చోట్ల లైటింగ్, జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు ఇతర భద్రతా చర్యలు చేపడితే ప్రమాదాలను తగ్గించవచ్చని వివరించారు.
Also read: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!
ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంతోపాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ప్రమాద స్థలాల వివరాలను ‘మార్గదర్శ్’ యాప్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పీఎం రాహత్ పథకం ద్వారా ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ పరిధిలోని జాతీయ రహదారిని అధికారులు పరిశీలించి, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఆనంద్, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రవీందర్ రాజ్, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వరరావు, మేడ్చల్ సీఐ అంజిరెడ్డి, రవాణా శాఖ అధికారులు లావణ్య, ఉపాసిని, డీఈఈ భవాని, ఏఈఈ రంజిత్, 297వ వార్డు ఏఈ మమత, 298వ వార్డు ఏఈ తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, స్థానిక నాయకులు కరెంట్ శంకర్, సంతోష్ గౌడ్, రేగు రాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read: గేమ్స్,ఫోటో యాప్స్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయా? ఇలా వెంటనే ఆపేయండి!