
Medico Suicide khammam(Breaking news updates in telangana) : ఖమ్మంలో వైద్య విద్యార్ధిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ హాస్టల్లోని గదిలో దంత వైద్య విద్యార్థిని మంటల్లో ఆహుతైంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఆమెది ఆత్మహత్య కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఖానాపురం హవేలి సీఐ శ్రీహరి కథనం ప్రకారం వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన సముద్రాల మానస ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఎదురుగా ఉన్న ప్రైవేట్ వసతిగృహం నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఉంటోంది.
ఆదివారం సాయంత్రం ఆమె గది నుంచి పొగలు రావడంతో స్నేహితులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోశారు. కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే మానస 80శాతానికి పైగా కాలిపోయి అపస్మార స్థితిలో ఉంది. మంటలు ఆర్పి వెంటనే మృత్యువుతో పోరాడుతున్న ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మానస మృతి చెందినట్లు నిర్దారించారు. వెంటనే సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు.
హాస్టల్ సమీపంలోని ఓ బంకు నుంచి మానస పెట్రోలు కొని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇటీవలే ఆమె తండ్రి మృతి చెందారు. ఈ పరిణామాలు చదువుపై కూడా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. 4 సబ్జెక్టులు బ్యాక్‌లాక్ ఉండటంతో మనోవేదన గురై బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహచర విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఆమె ఆత్మహత్యకు అసలు కారణాలేంటో ఇంకా తేలలేదు.