Minister Jupally: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నీరుగారకుండా యంత్రాంగం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకంలో 25 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు.
రైతు భరోసాలో ఇలాంటి తప్పిదం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మనసులోని మాట బయటపెట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రైతు భరోసా కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకే ఇస్తామన్నారు. ఇక రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో గ్రామ సభ నిర్ణయాలు కీలకమన్నారు.
ముఖ్యంగా అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను కేవలం 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలన్నారు. రేషన్ కార్డుల సంఖ్యను ప్రభుత్వం తగ్గిస్తుందని కేవలం అపోహ మాత్రమేనన్నారు. రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారందరికీ ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం కూడా అలాంటిదేనన్నారు.
ఇళ్లు లేని నిరుపేదలు అందరి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. కేవలం ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 6500 కోట్లు వడ్డీ చెల్లిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్నారు.
ALSO READ: తెలంగాణలో ‘పసుపు’ పాలిటిక్స్.. ఎంపీని టార్గెట్ చేసిన కవిత