Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. వచ్చేవారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 10 తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని మనసులోని మాట బయటపెట్టారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు షురూ అయ్యింది. ఈ మేరకు చిట్‌చాట్‌లో కీలక విషయాలు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని చెబుతూనే సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ వస్తుందన్నారు. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.
తొలుత ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు జరుగుతాయన్నారు. రెండో విడతలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించే అవకాశముందన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లును ఆదివారం శాసనసభలో మంత్రులు ప్రవేశపెట్టారు. దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ఆమోదం తర్వాత, మండలిలో చర్చ జరగనుంది.
అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఆ నోటిఫికేషన్ రానుంది. అయితే 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ నేపథ్యంలో బీసీ స్థానాల కేటాయింపుకు వారం రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలిపినట్టు సమాచారం.
ALSO READ: బీఆర్ఎస్ సభ్యులపై రుసరుస.. కడపులో విషం పెట్టుకున్నారన్న సీఎం రేవంత్
మరోవైపు తెలంగాణ ఎన్నికల సంఘం తన పనిని ముమ్మరం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను సెప్టెంబరు 10 లోపు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం సెప్టెంబరు 4 లేదా 5న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించమన్నారు.
6 లేదా 7న రాజకీయ పార్టీలతో సమావేశమై అభ్యంతరాలను స్వీకరించనుంది ఎన్నికల సంఘం. పరిశీలనల తర్వాత 8 లేదా 9న తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 10 లోపు స్థానిక సంస్థల ఎన్నికల ఘంట మోగనుంది. రిజర్వేషన్ల ఖరారు విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం.
ఏడాదిన్నరగా పాలక మండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. వాటిని తిరిగి పొందేందుకు ఎన్నికలు కీలకంగా మారాయి. ఇదిలాఉండగా సెప్టెంబరు 30 లోపు ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.