Konda Surekha: మహిళలు ఏ స్థానంలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా తమ మాతృత్వ గుణాన్ని మాత్రం మరచిపోరు. సాధారణంగా ఎవరైనా చిన్నారులు కనిపిస్తే చాలు.. మహిళల్లో అమ్మతనం వారి మదిలో మెదులుతుంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన ఒక్కపనిని చూసి.. మంత్రి అయితేనేమి మహిళే కదా.. అందులోనూ అమ్మతనం పంచిన ప్రేమ కదా అంటూ ఆమె అనుచరులు చర్చించుకున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఆ మహిళా మంత్రికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. ఆ మహిళా మంత్రి ఎవరో తెలుసా కొండా సురేఖ.
ఇటీవల అనూహ్యంగా పలు కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖ ఈసారి మరోమారు వార్తల్లో నిలిచారు. అయితే కామెంట్స్ తో కాదు గానీ, ఓ మంచి పనితో.. ఓ చిన్నారి రహదారిలో కాళ్లకు చెప్పులు లేకుండా, తన తల్లిదండ్రులతో వెళ్తుండగా, తన వాహనాన్ని ఆపి అమ్మతనాన్ని చాటి చెప్పారు మంత్రి.
వరంగల్ నుండి పెద్దపల్లికి మంగళవారం తన కాన్వాయ్ తో మంత్రి సురేఖ వెళ్తున్నారు. అదే సమయంలో సుల్తానాబాద్ వద్దకు రాగానే మంత్రి సురేఖ తన వాహనాన్ని ఆపమని డ్రైవర్ ను ఆదేశించారు. డ్రైవర్ కు అస్సలు అర్థం కాని పరిస్థితి. షెడ్యూల్ లోని గ్రామ సమీపంలో ఆపాల్సిన పరిస్థితి ఏమిటని ఆ డ్రైవర్ ఆరా తీశారు.
అంతే వాహనాన్ని ఆపడం ఆలస్యం.. పరుగులు తీసిన మంత్రి, రహదారిపై ఓ చిన్నారి కాళ్లకు చెప్పులు లేకుండా తల్లిదండ్రులతో వెళ్తుండగా వారివద్దకు వెళ్లారు. వెంటనే చిన్నారిని ఎత్తుకొని, ముద్దులాడిన మంత్రి కాళ్లకు చెప్పులు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. కొనలేదని తల్లిదండ్రులు తెలుపగా, చిన్న పాప కదా.. ఎలా నడుస్తుందమ్మా అంటూ మంత్రి వెంటనే తన వాహనంలో వారిని ఎక్కించారు.
కాస్త దూరం వెళ్లాక చెప్పుల దుకాణం ముందు మంత్రి కాన్వాయ్ ఆగింది. ఆ షాపు ఓనర్ కు ఏమి అర్ధం కాని పరిస్థితి. స్వయంగా పాపను ఎత్తుకున్న మంత్రి కారులో నుండి దిగి కనిపించగా, షాపు యజమాని ఆశ్చర్యపోయారు. మంత్రి సురేఖ షాపులోకి వెళ్లి పాపకు చెప్పులు కొనుగోలు చేశారు. అలాగే పాప డ్రస్ కూడా చిరిగినట్లు గమనించిన మంత్రి, మరో డ్రస్ కూడా కొనుగోలు చేశారు. మంత్రి గారు మీకు వేల దండాలు అంటూ.. చిన్నారి తల్లిదండ్రులు తమ కృతజ్ఞత చాటుకున్నారు.
మంత్రి కొండా సురేఖ గొప్ప మనసు
వరంగల్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న క్రమంలో సుల్తానాబాద్ వద్ద తల్లిదండ్రులతో కలిసి కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్న చిన్నారిని చూసిన కొండా సురేఖ
వెంటనే కారు ఆపి, చిన్నారిని దుకాణంలోకి తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చిన కొండా సురేఖ
చిన్నారికి… pic.twitter.com/f3gWq4MnvS
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2024
దేశానికి రాజైనా, రాణైనా తన బిడ్డల ముందు అమ్మా నాన్నలే. అలాగే మహిళలు ఏ పదవిలో ఉన్నా.. వారిలో అమ్మతనం అలాగే ఉండిపోతుంది. అటువంటి వాటికి ఉదాహరణగా మంత్రి కొండా సురేఖ చేసిన ఈ గొప్ప కార్యాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చిన్నారికి చెప్పులు, డ్రస్ ఇప్పించడంపై మంత్రి గారూ.. మీరు సూపర్ ఉమెన్.. అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.