Seethaka on BRS: అధికారంలో ఉంటే కోటీశ్వరులకు కొమ్ముకాశారు. అప్పుడు కూలీలు కనిపించలేదు. పేదలు పట్టలేదు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు భయపడి, ఒకటే పనిగా విమర్శిస్తున్నారు. నాడు ఏమయ్యాయి మీ మాటలు. ఇప్పుడు ఏదో సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. ఇకనైనా మారండి. ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక చేసే అబద్దపు ప్రచారాలు మానుకోండి అంటూ తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ.. జనవరి 26న అమలు చేసే పథకాలు అంతా డొల్లని, అసలు పథకాలు ఎవరికీ వర్తించే పరిస్థితులు లేవంటూ విమర్శించారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ అందరికీ వర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ పై సీతక్క భగ్గుమన్నారు. ఆదివారం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో లబ్ది చేకూరుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూలీలకు ఏకాన ఇవ్వకుండా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నారని, కోటీశ్వరులకు కొమ్ము కాసి..కష్టజీవులను విస్మరించిన ఘనత బీఆర్ఎస్ నేతలకే దకుతుందన్నారు.
అపోహలు వీడి కూలీలకు మంచి చేసే పథకాన్ని ప్రశంసించాలని మాజీ మంత్రి హరీష్ రావు కు సీతక్క కౌంటర్ ఇచ్చారు. భూమి లేని ఉపాధి కూలీలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధీ కూలీలకు రెండు దఫాల్లో ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతుందని మంత్రి గుర్తు చేశారు. యావత్ దేశం ఈ స్కీం పట్ల ఆసక్తి చూపుతుండగా.. తెలంగాణలోని కొన్ని రాజకీయ శక్తులు ఈ పథకంపై తప్పుడు గణంకాలతో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూలీలకు ఏకాన ఇవ్వని నేతలు ఇప్పుడు వారిపై కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. రూ. 500 కోట్ల ఆస్తులున్న వారికి సైతం రైతు బంధు ఇచ్చి.. రెక్కల కష్టం తప్ప ఎలాంటి ఆస్తి పాస్తులు లేని కూలీలను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూలీలకు ఆర్దిక చేయూతనందిస్తుంటే చూసి ఓర్వలేక అక్కసు వెల్లగక్కుతున్నారన్నారు. భూమిలేని ఉపాధి హమీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అని మేనిఫెస్టో లో కాంగ్రెస్ స్పష్టంగా నాడు హమీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన హమీకి కట్టుబడి ఏలాంటి భూమిలేని ఉపాధి హమీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని పునరుద్ఘాటించారు.
ఆసరా పెన్షన్లతో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుటుంబం యునిట్ గా అమలవుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం అదే నిబంధన వర్తిస్తోందని, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పోర్టల్ అధికారిక లెక్కల ప్రకారమే.. 2023-24 ఆర్దిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 48,13,966 జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలున్నాయన్నారు. ఇందులో 22.64 లక్షల కుటుంబాలు కనీసం ఒక్క రోజు కూడా ఉపాధి పనుల్లో పాల్గొనలేదని, కేవలం జాబ్ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా పరిగణించలేమని మంత్రి స్పష్టం చేశారు.
కూలీ ద్వారా జీవనోపాధి పొందితేనే ఉపాధి కూలీగా పరిగణించబడతారని, తెలంగాణలో పేరుకు 48,13,966 జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నప్పటికీ.. అందులో కనీసం ఒక రోజు ఉపాధీ హమీ పనుల్లో పాలు పంచుకున్న కుటుంబాలు 25.50 లక్షల వరకు ఉన్నాయన్నారు. కనిష్టంగా 20 రోజుల పాటు ఉపాధి కూలీగా పని చేసిన కుటుంబాలనే.. ఉపాధి హమీ ఆధారిత కుటుంబాలుగా పరిగణించడంతో.. సుమారు 17.26 లక్షల వరకు కుటుంబాలే 20 రోజుల పనిని పూర్తి చేసుకున్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఇందులో 11 లక్షల కు పైగా కుటుంబాలకు సొంత భూమి ఉండటంతో రైతు భరోసా లబ్దిదారులుగా ఉన్నారన్నారు.
Also Read: Big Shock to BRS: తెలంగాణలో బీఆర్ఎస్ కు షాక్.. ఆ మండలంలో ఇక కాంగ్రెస్ హవానే
దీంతో ఇచ్చిన మాట ప్రకారం.. ఎలాంటి భూమి లేని 6 లక్షలకు పైగా ఉపాధి కూలీ కుటుంబాలుంటాయన్న అంచనాతో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వీరితో పాటు అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి భరోసానిచ్చారు. అయితే గత పాలనలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలతో, రాజకీయ పక్షపాతంతో వ్యవహరించకుండా.. గ్రామ సభల్లోనే, ప్రజల సమక్షంలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు గుర్తించబడుతారని తెలిపారు. గ్రామ సభల నిర్ణయాలకు గౌరవం ఇస్తూ.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అర్హత ఉన్న అన్ని ఉపాధి కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల ఆర్దిక చేయుత నిచ్చి అండగా ఉంటామని మంత్రి సీతక్క తెలిపారు.