Aftercare Children: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. వారి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం స్వయంగా అందజేస్తోందనివెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ , సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో పాల్గొని ఆఫ్టర్ కేర్ విద్యార్థులకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి కీలక పత్రాలు అందజేశారు. రాష్ట్ర చరిత్రలోరికార్డు స్థాయిలో 1055 మంది పిల్లలకి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఈగల్ ఫోర్స్ తరఫున విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం సేనోటు డ్రగ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో సర్టిఫికెట్ల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్యలను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసిందని వివరించారు. అనాథ పిల్లలకు ఏకకాలంలో వేల సంఖ్యలో ద్రువీకరణ పత్రాలు అందజేయడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ఈ ధ్రువపత్రాలు కేవలం కాగితాలు కావు ఇవే మీ భవిష్యత్తుకు బాటలు వేసే సాధనాలు అని పేర్కొన్నారు. కుటుంబ ఆదరణ లేకపోయినా కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చిన విద్యార్థులను అభినందించారు. వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read: మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు
మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మీ జీవితాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించే వారు ఉంటారు… కానీ మీరు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలను చేరవేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే వేలాది ధ్రువపత్రాలు అందజేయడం జరిగిందని, మిగతా ప్రక్రియలు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసదుపాయం అందుతున్నదని, బాలల భద్రత, పునరావాసం, విద్య, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి భద్రంగా ఉండాలని, ప్రతి యువకుడు సరైన దిశలో ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అదే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, వచన్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి, ఈగల్ ఫోర్స్ అధికారులు గిరిధర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Also Read: మల్కాజ్‌గిరిలో బీజేపీ ముసలం.. ప్రీతిరెడ్డికి చెక్ పెట్టిన బీజేపి అధిష్టానం..!