Seethakka Slams KTR: మహిళలకు ఫ్రీ బస్సు పెడితేనే ఓర్వడం లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ ను ఎవరూ గుర్తించడం లేదని రాహుల్ గాంధీ ని నిందించడాన్ని అలవాటు గా మార్చుకున్నాడని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ని తిడితే పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ వైఫల్యాల మీద మాట్లాడాలంటే కేటీఆర్ కు వణుకు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతీ పథకం ను సమర్దవంతంగా అమలు చేస్తున్నామని, పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ ముందు మీ నాయకుల డ్రగ్స్ దందా గురించి మాట్లాడాలని, మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫౌంహౌస్ లలో కొనసాగిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ నేత పై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్ ను ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థం అవుతుందన్నారు.
స్త్రీనిధి కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సంస్థపై తప్పుడు ప్రచారాలు జరిగితే వాటిని తక్షణమే ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించాలని ఆదేశించారు. గ్రామ, పట్టణ స్థాయిలో రుణాలు, రికవరీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం స్రీనిధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
స్త్రీనిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు అందుతున్న రుణాలు,పంపిణీ, తిరిగి చెల్లింపుల పరిస్థితి, సంస్థ పురోగతి తదితర అంశాలపై ఆరా తీశారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో స్త్రీనిధి ద్వారా రూ.1947 కోట్ల రుణాలు పంపిణీ చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఇప్పటికే రూ.2064 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందజేశారు. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ రుణ ప్రణాళికలో దాదాపు 90 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం 78 శాతం రికవరీ సాధించగా, ప్రస్తుత సంవత్సరం 72 శాతం రికవరీ నమోదైందని, సెర్ప్ మరియు మెప్మా సిబ్బంది సమన్వయంతో 85 శాతం రికవరీ లక్ష్యంతో క్షేత్రస్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు (పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్) ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు.
పత్రికల్లో స్త్రీనిధి కార్యకలాపాలపై వచ్చిన కథనాలపై మంత్రి చర్చించారు. వాటిలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్త్రీనిధి నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ఎక్కడైనా నిర్ధారణ అయితే సంబంధితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్త్రీనిధి సంస్థ పేద మహిళలకు ఆర్థిక అండగా నిలుస్తూ వేలాది కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ఇందిర మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: LPG Saving Kitchen Tips: గ్యాస్ త్వరగా అయిపోతుందా? చాలా మంది కిచెన్‌లో చేసే 10 పొరపాట్లు ఇవే!