Miss World Contestants: హైదరాబాద్ లో మిస్ వరల్డ్ – 2025 అందాల పోటీలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ అందాల పోటీలకు హాజరయ్యే ప్రపంచ సుందరులను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. కానీ మనం వారిని చూసి మురిసి పోతుంటే, ఈ అందగత్తెలు మాత్రం మేము ఆ ఊరు చూడాల్సిందేనంటూ పట్టుబట్టేస్తున్నారట. మా షెడ్యూల్ లో ఆ ఊరు ఉండాల్సిందే అంటున్నారట. అందరి చూపు వారి వైపు ఉంటే, ఈ అందగత్తెలు మాత్రం ఆ ఊరికి వెళ్లాలని అనుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. ఇంతకు ఆ ఊరు ఎక్కడుంది? అందాల తారలు అక్కడికి ఎందుకో తెలుసుకుందాం.
అందాల తారలు దిగివచ్చిన వేళ..
హైదరాబాద్ నగరానికి ఒక్కొక్కరుగా అందాల తారలు దిగి వస్తున్నారు. మిస్ వరల్డ్ – 2025 పోటీలకు హైదరాబాద్ కేంద్రం కావడంతో ప్రపంచంలోని అందగత్తెలు భాగ్యనగరం బాట పట్టారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విదేశాల నుండి ప్రపంచం మెచ్చిన అందగత్తెలు వస్తుండగా, అధికారులు వారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ పోటీల నిర్వహణతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
సిల్క్ సిటీ గురించి తెలుసా..
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ గ్రామమే పోచంపల్లి. ఇది “సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా”గా పేరుపొందింది. ముఖ్యంగా ఇక్కడ తయారయ్యే పోచంపల్లి ఇక్కత్ చీరల కారణంగా ఈ గ్రామానికి ప్రపంచపటంలోనే ప్రత్యేక స్థానం. పోచంపల్లి చీరలు ప్రత్యేకమైన “ఇక్కత్” శైలిలో తయారవుతాయి. దీనిని పాగడు బంధుగా కూడా పిలుస్తారు. ఈ శైలి ద్వారా తయారయ్యే చీరలు, వస్త్రాలు ప్రసిద్ధి పొందాయి. ఈ గ్రామం 2005లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కులను పొందింది. దీనితో పోచంపల్లి చీరల ప్రత్యేకతను గుర్తింపు లభించినట్లయింది. ఇక్కడ 10,000కి పైగా కుటుంబాలు ఈ హస్తకళలో నిమగ్నమై ఉన్నాయి.
రికార్డులకు కొదువ లేదు
2021లో పోచంపల్లి గ్రామం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుండి బెస్ట్ టూరిజం విలేజ్ గా గుర్తింపు పొందింది. అలాగే, పోచంపల్లి గ్రామం ఐకానిక్ సారీ వీవింగ్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియా గా UNESCO జాబితాలో పోచంపల్లి చేరింది. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పోచంపల్లిలో రూరల్ టూరిజం కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్, బూడాన్ పోచంపల్లి మ్యూజియం వంటి ప్రదేశాలు సందర్శించవచ్చు.
మేము ఒప్పుకోము.. పోచంపల్లికి వెళ్తాం
తమ పర్యటనలో పోచంపల్లి సందర్శన తప్పక ఉండాలని మిస్ వరల్డ్ 2025 పోటీలకు వచ్చే అందగత్తెలు కోరుతున్నారట. ఆ గ్రామ విశేషాలు, అక్కడి వింతలు, అలాగే అక్కడి కళాకారుల హస్తకళా నైపుణ్యం తప్పక చూడాలని ప్రపంచ అందగత్తెలు తెగ ఆరాట పడుతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మే 15న పోచంపల్లికి..
ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలో భాగస్వాములు అవుతున్న మిస్ వరల్డ్ – 2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్ పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్కత్ సాంప్రదాయ టై-అండ్-డై ప్రక్రియను చూస్తారు. నిష్ణాతులైన నేత కార్మికులతో సంభాషిస్తారు. హైదరాబాద్ నిజాంలు ఒకప్పుడు అభిమానించిన డబుల్ ఇకాట్ కళాఖండమైన ఐకానిక్ టెలియా రుమల్ తయారీని చూస్తారు. ఆచార్య వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన ఈ గ్రామం వస్త్ర కళాత్మకతకు చిహ్నమని చెప్పవచ్చు.
Also Read: Vizag Colony: మీ చేతిలో రూ. 500 ఉందా? ఈ టూరిస్ట్ స్పాట్ మిస్ కావద్దు
మిస్ వరల్డ్ వేదిక అపూర్వమైన అంతర్జాతీయ దృశ్యమానతను అందిస్తున్నందున, ఈ ప్రతిష్టాత్మక సందర్శన తెలంగాణ యొక్క గొప్ప చేనేత వారసత్వాన్ని ప్రపంచ పటంలో ఉంచుతుంది. పోచంపల్లి యొక్క శక్తివంతమైన నేత, గ్రామీణ హస్తకళ మరియు సాంస్కృతిక లోతును ప్రదర్శించడం ద్వారా, ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత అభిమానులకు భారతదేశ జీవన సంప్రదాయాల యొక్క శక్తివంతమైన వేడుకగా మారుతుంది. ఈ నెల చివర్లో హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కోసం అంచనాలు పెరుగుతున్న కొద్దీ, పోచంపల్లి సందర్శన ఒక హైలైట్‌గా నిలవనుంది.