Telangana Govt: మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలతో అర్హులైన వారికి సరుకులు అందజేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఏయే ప్రాంతాలకు అందడం లేదు. ఎంతమంది అర్హులున్నారనే వివరాలను సేకరించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి అందజేయాలని భావిస్తుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ లో అందజేయాలని భావిస్తుంది. అందుకు ప్రతి ఏటా 4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. గర్భిణులకు, చిన్నారుల్లో పోషకాహార లోపంతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీ) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, స్లమ్ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సేవలు అందని అర్హుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు దిశగా రాష్ట్రమహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తులు ప్రారంభించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 2,364 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇంకా అందనిప్రాంతాలు ఉన్నాయా? ఎంతమంది ఉంటారనేదానిపై క్షేత్రస్థాయిలో మహిళాశిశు సంక్షేమశాఖ సర్వేనిర్వహించారు. ఈ సర్వేలో హెచ్‌ఎండీఏ పరిధిలోని 274 కవర్ కాని బస్తీల్లో 25,310 మంది అర్హులైన చిన్నారులు, గర్భిణీలు, బాలింతలను గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో వీరికి పోషకాహార సేవలు సక్రమంగా అందడం లేదని వెల్లడైంది. అయితే అధిక జనసాంద్రత, తరచూ వలసలు, నిబంధనల పరిమితులు, బస్తీల్లో భవనాల లభ్యత లేకపోవడం, సాంకేతిక అడ్డంకులు వంటి కారణాల వల్ల కొత్త అంగన్‌వాడీ కేంద్రాల స్థాపనలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించింది. అర్హులందరికీ అంగన్‌వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. టేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాలకే సరుకులు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బాలమృతం, పాలు, స్నాక్స్, కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థాలను పంపిణీ చేయనున్నారు.
Also Read: Municipal Elections 2026: తెలంగాణలో జనసేన బోణి.. నేరేడుచర్లలో ఎగిరిన గ్లాసు జెండా
ఈ ప్రణాళికలో భాగంగా గ్రేటర్ లో 274 స్లమ్ ప్రాంతాలను కవర్ చేస్తూ 37 వాహనాలను అద్దెకు తీసుకుని మోబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.60,000 అద్దె చెల్లించనున్నారు. జిల్లా వారీగా హైదరాబాద్‌లో 7, మేడ్చెల్–మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మోబైల్ కేంద్రాలను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. మోబైల్ అంగన్‌వాడీ వాహనాల ద్వారా ఆయా ప్రాంతాల్లోని అర్హులకు పోషకాహారాన్ని అందచేయనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్‌వాడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పోషకాహార సేవలు అర్హులందరికి అందాలని, సాంకేతిక సమస్యలతో ఏవరూ నష్టపోకూడదన్న లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. అర్హులైన ఏ ఒక్కరూ కూడా నష్టపోకూడదు, పోషకాహారానికి ఆటంకం కలగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలలో భాగంగా పోషక లోప రహిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం. గ్రేటర్ లో గుర్తించిన 274 స్లమ్ ప్రాంతాలను కవర్ చేస్తూ 37 వాహనాలను అద్దెకు తీసుకుని మోబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించి అర్హులైన 25,310 మందికి పోషకాహార పదార్దాలను పంపిణీ చేస్తాం. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: Heart Health: గుండె ఆరోగ్యం కోసం గంటల తరబడి శ్రమించక్కర్లేదు.. ఈ చిన్న మార్పులు చాలు!