Janwada Farm House :
⦿ జన్వాడ ఫాంహౌస్ అంటేనే కాంట్రవర్సీ
⦿ ఒకరు దీపావళి పెస్టివల్ అన్నారు
⦿ ఇంకొకరు గృహ ప్రవేశమని చెప్పారు
⦿ డ్రగ్స్ బయటపడిన ప్రతిసారీ బీఆర్ఎస్ వాళ్ల రాద్ధాంతం ఎందుకు?
⦿ వాళ్లందరికీ టెస్టులు చేస్తే తేలిపోతుంది
⦿ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, స్వేచ్ఛ : రాజ్ పాకాల ఫాంహౌస్ పార్టీపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అంతా ప్రభుత్వ కుట్ర అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్‌కి సిగ్గు ఉండాలని మండిపడ్డారు అనిల్ యాదవ్.
కేటీఆర్‌కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని, గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ‘‘జన్వాడ ఫాంహౌస్ అంటేనే కాంట్రవర్సీ. ఒకసారి దీపావళి పెస్టివల్, ఇంకోసారి గృహ ప్రవేశం అంటున్నారు. డ్రగ్స్‌ని స్కూల్ పిల్లల వరకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వానిదే. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే, వాళ్ళు డ్రగ్స్‌ని ప్రేరేపించాలని చూస్తున్నారు. తెలంగాణాను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటుంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడు. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి చెప్పాడు. తర్వాత స్టేట్మెంట్‌ను మార్చాడు. ఫాంహౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు? అసలు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రజలు అడుగుతున్నారు’’ అంటూ విమర్శలు చేశారు అనిల్ కుమార్ యాదవ్.