Murali Naik: సిఎల్పీ మీడియా హాల్ వేదికగా మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ బిఆర్‌ఎస్ నాయకత్వంపై పదునైన విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నైతికతను ప్రశ్నిస్తూ పలు తీవ్ర ఆరోపణలు చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపాటు
కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నారని, సర్వేలు అదే చెబుతున్నాయని కేటీఆర్ అనడం పూర్తి హాస్యాస్పదమని మురళీ నాయక్ కొట్టిపారేశారు. ‘కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని కేటీఆర్ చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆయన ప్రజల గుండెల్లో లేదు, ప్రజలకు ఏమాత్రం అందకుండా ఫామ్‌హౌస్‌లు కట్టుకుని దూరంగా ఉంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తమ భూముల వివరాలను వెంటనే బయటపెట్టి, భూ సర్వేకు సంపూర్ణంగా సహకరించాలని డిమాండ్ చేశారు. ‘మాకు ఒక్క ఇంచు భూమి ఎక్కువ ఉన్నా తీసుకోండి’ అని కేసీఆర్ స్వయంగా చెప్పి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
కోవర్ట్ రాజకీయంపై ఆగ్రహం
ఇంగుర్తి గ్రామానికి చెందిన సత్తూరి యాదగిరి వ్యవహారాన్ని ఉదాహరణగా చూపుతూ.. బిఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. యాదగిరి కాంగ్రెస్‌లో చేరి బిఆర్‌ఎస్ కోవర్ట్‌గా పనిచేశాడని, కేవలం ఉప సర్పంచ్‌గా గెలవడం కోసమే కాంగ్రెస్‌ను వాడుకున్నాడని స్పష్టం చేశారు. గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే మళ్లీ బిఆర్‌ఎస్‌లో చేరితే, కేటీఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ నాయకులనే తీసుకొచ్చి కొత్తగా పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక్కడే చేరితే వందల మంది చేరుతున్నారని ప్రచారం చేసుకోవడం వారి మైండ్ గేమ్‌లో భాగమేనని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కవిత భూదందా
మహబూబాబాద్‌లో గతంలో మాజీ ఎంపీ కవిత భారీగా భూదందాలకు పాల్పడ్డారని మురళీ నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ అక్రమాలను తరిమికొట్టడానికే నియోజకవర్గ ప్రజలు తనను 50 వేల భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ప్రస్తుతం మహబూబాబాద్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఈ జిల్లా కాంగ్రెస్‌కు తిరుగులేని కంచుకోట అని చెప్పారు.
పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న తమ కాంగ్రెస్ ప్రభుత్వం ‘చేతల ప్రభుత్వం’ అని, త్వరలోనే ప్రజలు బిఆర్‌ఎస్‌కు శాశ్వతంగా చరమగీతం పాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం.. ఘట్‌కేసర్ వద్ద విషాదం!