SLBC Tunnel Collapsed: SLBC సొరంగంలో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. పైకప్పు 3 మీటర్ల మేర కుంగిపోయిన ఘటనలో… కొందరు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు… ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆరా తీశారు. కొన్నేళ్లుగా ఆగిపోయిన SLBC సొరంగం పనులు… తిరిగి 4 రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. ఈలోపే పైకప్పు కూలిపోవడంతో… దానికి కారణాలేంటో అధికారులు తెలుసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాద సమయంలో 50 మంది వరకు టన్నెల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఏడుగురు ఆచూకీ తెలియాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు.
ఎస్.ఎల్.బి. సి టన్నెల్ ప్రమాద సంఘటన స్థలిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన చాలా దురదృష్టకరం. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ టీమ్, భారత సైన్యం కూడా రంగంలోకి దిగుతారు. ఉత్తరాఖండ్ ఘటనలో పాల్గొన్న రెస్క్యూ టీమ్ ఇక్కడికి రాబోతుంది. లోపట చిక్కుకున్నవారిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు మరో ఆరుగురు ఉన్నారు’’ ఉన్నారని తెలిపారు.
కాగా శ్రీశైలం నుంచి సొరంగం మార్గం ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీశైలం సొరంగం మార్గం పనులు మొదలయ్యాయి. 16 ఏళ్లు పైనే అవుతున్నా ఇంకా ఈ పనులు పూర్తి కాలేదు. మరో 10 కిలోమీటర్లు SLBC సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 30 టీయంసీల నీటిని తరలించి నల్గొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైట్ పీడిత గ్రామాలకు కృష్ణా జలాలను అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
SLBC ప్రాజెక్టులో భాగంగా 44 కిలోమీటర్ల మేర ఇన్‌లెట్, ఔట్‌లెట్ సొరంగాలను తవ్వే పనులు కొన్నేళ్లుగా సాగుతున్నాయి. ఇప్పటికే 34 కిలోమీటర్లకు పైగా సొరంగం పనులు పూర్తికాగా.. ఇంకా 9.5 కిలోమీటర్లకు పైగా తవ్వాల్సి ఉంది. ఈ పనుల కోసం 4 వేల 600 కోట్లకుపైగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే గ్రీన్‌ఛానెల్ కింద తొలివిడతగా 2 వేల 200 కోట్లు విడుదల చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో 4 రోజుల కిందటే పనులు తిరిగి ప్రారంభించారు. ఈలోపే ఈ ప్రమాదం జరిగింది.
Also Read: 60 ప్రాపర్టీలు.. రూ.2 వేల కోట్లు టార్గెట్.. జీహెచ్ఎంసీ రప్పా రప్పా
2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. SLBC ప్రాజెక్టు నిర్మాణానికి 2 వేల 200 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 60 నెలల్లో పనులు పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు 30 TMCల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జలాల ద్వారా 3 లక్షల 41 వేల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని భావించింది. కానీ… టన్నెల్ తవ్వకం పనులు మొదలయ్యాక అనేక సాంకేతిక సమస్యలు, వరదల కారణంగా పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఓవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ పాడైపోవడం, BRS ప్రభుత్వం వచ్చాక SLBCకి నిధులు విడుదల చేయపోవడంతో… పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… ప్రత్యేక శ్రద్ధ తీసుకుని SLBC పనులను ప్రారంభించింది.