BigTV English

Hydra: హైడ్రా దూకుడు తగ్గిందా?

Hydra: హైడ్రా దూకుడు తగ్గిందా?

Hydra: ప్రభుత్వ భూములను రక్షిస్తాం, చెరువులు, నాలాలు పరిరక్షిస్తాం, హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడుతాం… హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఇదే అన్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పగా సెలవిచ్చారు. అయితే ఆ దిశగా మొదట్లో కొంత వేగంగా వెళ్లిన హైడ్రా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పిన హైడ్రా ఆ తర్వాత మానవతా దృక్పథం అంటూ తన వైఖరి మార్చుకుంది. వేసవి సెలవుల్లో అక్రమంగా వెలిసిన విద్య సంస్థల భవనాలను తొలగిస్తామని చెప్పిన అధికారులు సెలవులు పూర్తవుతున్నా అటువైపు చూడకపోవడం విమర్శల పాలవుతోంది..


హైడ్రా… హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటైన ఒకటి రెండు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు చెందిన భారీ నిర్మాణాలను కూలుస్తూ సంచలనాలకు తెరతీసింది. చెరువులు, బఫర్ జోన్లలో, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ ప్రజల మన్ననలు పొందింది. సామాన్యులకు చెందిన నిర్మాణాలను కూల్చివేయడం, అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేస్తుందన్న ఆరోపణలతో హైడ్రాకు కొన్ని సందర్భాల్లో చెడ్డ పేరు కూడా వచ్చింది..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగింపులో హైడ్రా చురుకైన పాత్ర పోషిస్తుందని భావించిన ప్రజలు అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై వేలాది ఫిర్యాదులు చేశారు. నాలాలు, రోడ్లు, పార్కులు, ఓపెన్ స్పేసెస్‌లో ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్నాయి.. భారీ నిర్మాణ సంస్థలు, రాజకీయ ప్రముఖులు చేసిన కబ్జాలపై సైతం హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. విద్యాసంస్థలు సైతం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశాయని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రముఖంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన పలు కట్టడాలు ఉన్నట్లు కంప్లైంట్లు అందాయి.


ALSO READ: Telangana: రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.51 కోట్ల నిధులు విడుదల

దుండిగల్ గ్రామ పరిధిలో చెరువు శిఖంలో భవనాలు నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కొంతమేర కూల్చివేతలు కొనసాగించారు. అక్కడ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని, వేసవి సెలవుల్లో మిగతా వాటిని పరిశీలిస్తామని చెప్పి వెళ్లిపోయారు, అయితే వేసవి సెలవులు పూర్తవుతున్నా ఆ ఆక్రమణల జోలికి అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇక పాత బస్తీ సలకం చెరువు లో ఫాతిమా కాలేజ్ నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఎంఐఎంకు చెందిన ప్రధాన వ్యక్తులు ఈ కాలేజ్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై అప్పట్లోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అయితే అక్కడ కాలేజ్ రన్నింగ్ అవుతున్నందున ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. చెరువులు ఎంత ముఖ్యమో విద్యార్థుల ఎకడమిక్ ఇయర్ కూడా అంతే ముఖ్యమని, అందుకు అనుగుణంగా టైం ఇస్తామని వారు సెటరైట్ చేసుకుంటే ఓకే లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ALSO READ: TG Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు తీపి కబురు.. కేవలం 10 రోజుల్లో

ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్మాణాలు సైతం పోచారం మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్‌లోని నాడెం చెరువు బఫర్ జోన్, ఎఫ్డీఏలో ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని కూడా పరిశీలించారు అధికారులు. మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చెరువులో ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పుడు విద్యాసంవత్సరం రన్నింగ్ లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సెలవుల్లో వాటిపై చర్యలు తీసుకుంటారని అంతా భావించినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోతుండటం విమర్శల పాలవుతోంది. ప్రధాన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చెరువులు, నాలాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేసినా, అలాంటి వాటిని కూల్చివేయకపోవడం వెనక కారణం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మొదట్లో ఫిర్యాదు వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూల్చివేసిన అధికారులు ఆ తరువాత కొంత సడలింపులు ఇచ్చింది. అప్పటికే ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఇళ్లలో పబ్లిక్ నివాసం ఉంటే అలాంటి వాటిని కూల్చబోమని హైడ్రా ఒక ప్రకటన చేసింది. అయితే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చిన అధికారులు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ విషయంలో వేసవి సెలవుల్లో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు . ఇప్పుడు సెలవులు పూర్తి అవుతున్నా అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం విమర్శల పాలవుతోంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×