Nizamabad VDC Controversy: పెదరాయుడు సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో పెదరాయుడు ఒకసారి తీర్పు ఇస్తే ఇక అంతే. అదంటే సినిమా కాబట్టి సరిపోతుంది. నిజ జీవితంలో అలాంటి చర్యలకు వీలు ఉంటుందా? అలాంటి తీర్పులు సమంజసమేనా? మనకంటూ చట్టం, అధికార యంత్రాంగం ఉంది. కానీ ఇవన్నీ పట్టించుకోని కొంత మంది పెదరాయుడులు రెచ్చిపోయారు.
ఇప్పుడు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. గ్రామాల్లో పెదరాయుళ్ల భరతం పట్టేందుకు ఆ జిల్లా అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. దీనితో పాపం పెదరాయుళ్లు కాస్త పేద రాయుళ్ల మాదిరిగా మారిన పరిస్థితి ఆ జిల్లాలో కనిపిస్తోంది. ఇంతకు ఆ జిల్లా ఏది? పెదరాయుళ్ల పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.
గ్రామాల్లో పెద్దరాయుడి తీర్పులు అంటూ కొనసాగే కుల బహిష్కరణ పై ఆ జిల్లా పోలీసు బాస్, అక్కడి న్యాయస్థానం అస్సలు తగ్గదేలే అంటున్నారట. ఏకంగా గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ (గ్రామ అభివృద్ధి పేరుతో ఏర్పాటైన సంఘం) సంఘాలను జైలుకు పంపారు అంటే ఏ స్థాయిలో వీడీసీ అరాచకాలు ఉన్నాయో ఊహించలేని పరిస్థితి. ఆ జిల్లాలో అసలు ఎందుకు సాంఘిక బహిష్కరణకు దారితీసిన కారణాలు ఏంటి? అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తో వీడీసీ అగడాలకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారో తెలుసుకుందాం.
గ్రామాభివృద్ధి పేరుతో ఏర్పడిన కమిటీలు భూ తగదాలు, కులవృత్తులు, ఇళ్ల నిర్మాణాలు తదితర పంచాయితీల్లో తలదూర్చి అమాయకులపై హుంకరిస్తే ఊచలు లెక్కించాల్సిందేననే సంకేతాలను పోలీసులు ఇస్తున్నారు. పలు గ్రామాల్లో వీడీసీ(గ్రామాభివృద్ధి కమిటీ)ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అయితే చాలా మంది బాధితులు వారి నియంతృత్వ ధోరణిని ఎదిరిస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
బాధితులు భయపడకుండా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో పోలీసులు సైతం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తు న్నారు. అప్పటికే చాలా వీడీసీలపై పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్, మునిపల్లి వీడీసీలు జైలుకు వెళ్లాయి. రెండు కేసుల్లో 15 రోజుల వ్యవధిలోనే కోర్టు తీర్పులు వెలువడ్డాయి.
వేలు పెట్టారు.. ఇక అక్కడికే వెళ్లారు!
భూ పంచాయితీలో తలదూర్చి తనను కులం నుంచి బహిష్కరించారని జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ వీడీసీపై గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హన్మాండ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. విచారణ అనంతరం వీడీసీ సభ్యులకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఈనెల 3వ తేదీన జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు. వీడీసీ సభ్యులు ప్రస్తుతం హైదరాబా ద్ లోని చంచల గూడ జైలులో ఉన్నారు.
అలాంటిదే నాయక్పోడ్ కులస్తులపై సామాజిక బహిష్కరణ విధించిన జక్రాన్పల్లి మండలం మునిపల్లి వీడీసీ సభ్యులు 13 మంది సారంగాపూర్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. గ్రామంలోని శివాలయానికి వెళ్లే రోడ్డు కబ్జాకు గురైందని, తమకు దారి చూపాలని నాయక్పోడ్ కులస్తులు కోరగా 2012 నవం బర్ లో అప్పటి సర్పంచ్ సాయిరెడ్డి, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వారిపై వీడీసీ సామాజిక బహిష్కరణ విధించింది.
అప్పట్లో రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగిన ఘటన దీంతో నాయక్వాడ్ కులస్తులు జక్రాన్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో 13 మందికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఈనెల 17వ తేదీన నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు.
Also Read: Hyderabad Tourism: హైదరాబాద్ లో ఆ ప్లేస్ అంటే భయం భయం.. ఇకపై అక్కడికి పరిగెత్తడం ఖాయం!
మీరు చెప్పిందే శాసనమా?
గ్రామాల్లో సమాంతర ప్రభుత్వం నడిపేందుకు ప్రయత్నిస్తున్న వీడీసీలు మేము చెప్పిందే శాసనం .. అనేలా వ్యవహరిస్తున్నా.. బాధితులు ఏ మా త్రం భయపడకుండా ప్రశ్నిస్తున్నారు. గ్రామ, కుల, సామాజిక బహిష్కరణలపై పోలీసు స్టేషన్లకు వెళ్తున్నారు. వీడీసీలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్న పోలీసులు.. విననిపక్షంలో కేసులు నమోదు చేస్తున్నారు. సీపీ సాయి చైతన్య సైతం వీడీసీల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ మార్పు కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వీడీసీలు.. తమ నియంతృత్వ ధోరణిని మాత్రం వదులుకోవడం లేదని, దీంతో బాధితులు చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారని అంటున్నారు, కల్లు గీత కార్మికులు చెట్లు గీయాలన్నా, గొల్లకుర్మలు జీవాలను మేపాలన్నా ఇలా ఆయా కులవృత్తుల వారి నుంచి వీడీసీలు ప్రతి ఏడాది డబ్బులు వసూలు చేస్తున్నాయి.
జైలుకు పంపగా.. నోర్లు కట్టేసుకున్నారట!
వీడీసీ చేస్తున్నారా పాలనను అరికట్టేందుకు మొట్టమొదటిసారి న్యాయస్థానం సాంఘిక బహిష్కరణ చేస్తున్న సంఘాలను జైలుకు పంపడంతో ఒకసారిగా జిల్లాలో విడిసి సంఘాలు ఉలిక్కి పడ్డాయి. మరోసారి సాంఘిక బహిష్కరణ, సామాన్య ప్రజలను ఇలాంటి ఇబ్బంది పెట్టిన కఠిన తరమైన శిక్షలు ఉంటాయని చెప్పకనే చెబుతూ అరాచక పాలన సాగించిన సంఘాలను జైలు పాలు చేసింది. ఇప్పటికైనా మారండి అంటూ మొట్టికాయలు వేసింది.
విడిసి ఆగడాలను అరికట్టడానికి మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖకు కూడా ఆదేశాలు జారీ చేస్తూనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అరాచక పాలనకు స్వస్తి పలకాలని పోలీసులు న్యాయస్థానం ఆశిస్తూనే మనము ఆశిద్దాం. మొత్తం మీద నేను పెద్దరాయుడు అనే మాట అనేందుకు కూడా ఎవరూ సాహసించని పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. పోలీసులు, చట్టం తీసుకుంటున్న చర్యల పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే పేద రాయుళ్ళు కావడం గ్యారంటీ.