Kaushik Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలోని బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ మార్క్ చెరపడం ఎవరి తరమూ కాదు
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ రోజు అదే కేసీఆర్ హయాంలో నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు ఈ కలెక్టరేట్ నిర్మాణంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏముందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టిన సచివాలయం, ఆస్పత్రులు, కలెక్టరేట్లే నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని, రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారని విమర్శించారు.
కొడంగల్‌లో కనీస అభివృద్ధి ఏది?
గత పదేళ్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతం అభివృద్ధి అయినా రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో చూపించాలని సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గంలో విద్యుత్ కోతల వల్ల ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, అక్కడ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భవన్‌కు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సిరిసిల్ల సభకు జనం రాక ఇతర జిల్లాల నుండి జనాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
హుజూరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి
హుజూరాబాద్ నియోజకవర్గానికి వెంటనే రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే రెండేళ్లలో మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీ ఆపరేషన్.. సముద్రంలో రూ.3,000 కోట్ల డ్రగ్ సీజ్.. సినిమా రేంజ్ ఛేజింగ్!